Jun 01,2023 20:41

జెండా ఆవిష్కరిస్తున్ననాయకులు లక్ష్మణ్‌

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     రవాణా రంగం బతకాలంటే ప్రభుత్వాల దోపిడీ విధానాలు మారాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రోడ్డు రవాణా భద్రతా చట్టం రద్దు చేయాలని ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి గాజులపల్లి ఆటో యూనియన్‌ కార్యదర్శి సుంకన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌ టిడబ్ల్యూఎఫ్‌ గత 50 సంవత్స రాలుగా రవాణా రంగం కార్మికుల సంక్షేమం కోసం, హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తుందన్నారు. రవాణా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ విధానాలతో చావుదెబ్బ తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలకు అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌, గ్రీసు, ఆయిల్‌ వంటి ఉత్పత్తులు, ఇతర విడిభాగాల ధరలు, వాహన పన్నులు, టోల్‌ చార్జీలు విపరీతంగా పెంచుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రవాణా రంగాన్ని కుదేలు చేస్తుందని అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ జిఎస్టి విధానం తెచ్చారని, పెట్రోల్‌, డీజిల్‌పై అమలు చేయకపోవడంలో ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రవాణా రంగంపై భారాలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్‌తో పాటు 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు పెన్షన్‌ సౌకర్యం, జాతీయ రహదారులపై ప్రతి వంద కిలోమీటర్లకు ఒకచోట రెస్టు రూములు, నీటి వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీటి సాధన కొరకు ఫెడరేషన్‌ ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్న దని, పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో సుంకన్న, మాస్టర్‌ నరసింహ, కుమార్‌, లక్ష్మినరసింహ, బాలస్వామి, అమీర్‌, ఆయూబ్‌, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.