సంగీతం, సాహిత్యంతో ప్రశాంతమైన జీవితం
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : విశ్రాంత ఉద్యోగుల జీవనం సంగీతం, సాహిత్యంతో ముడిపడి ఉంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని శతావధాని ఉప్పల ధడియం భరత్ శర్మ పేర్కొన్నారు. పుత్తూరులోని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనంలో శతావధాని ఉప్పల ధడియం భరత్ శర్మ తన 60వ అష్టావధానాన్ని నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భాస్కర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ అష్టావధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీ య విద్యాభవన్ తిరుపతి కేంద్ర సంచాలకులు డాక్టరు నడింపల్లి సత్యనారాయణరాజు హాజరయ్యారు. పుత్తూరు, పరిసర ప్రాంతాల్లోని సీనియర్ సిటిజన్స్ హాజరై అష్టావధానాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. తిరుపతికి చెందిన శతావధాని ఉప్పల ధడియం భరత్ శర్మ అష్టావధానానికి మరో శతావధాని ఆముదాల మురళి సంచాలకులుగా వ్యవహరించారు. పచ్ఛకులుగా నిషిద్ధాక్షరికి ఒంటె రవి, సమస్యకు గండుపల్లి గోవిందయ్య, దత్తపదికి శోభా రాజ, న్యస్తాక్షరికి వేంకటరమణ, వర్ణనకు చంద్రశేఖర శర్మ, ఆశువుకు రంగన్న, ఛందోభాషణకు మల్లెల నాగరాజు, అప్రస్తుత ప్రసంగానికి పాలూరి బ్రహ్మానంద రెడ్డి హాజరై అవధానికి పలు ప్రశ్నలు సంధించారు. కాగా పచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు శతావధాని ఉప్పల ధడియం భరత్ శర్మ తనదైన శైలిలో దీటుగా పద్యాలతో సమాధానాలను ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కథారచయిత ఆర్‌సి కష్ణస్వామిరాజు, చంద్రబాబు, హైకోర్టు అడ్వకేట్ మెరుపుల మహేశ్, విజరు కుమార్ పిళ్ళై , గాయకులు సోము ఉమాపతి పాల్గొన్నారు.










