Jun 27,2023 22:21

చైర్‌పర్సన్‌ పోడియం ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న కౌన్సిలర్‌ నాసీర బాను

ప్రజాశక్తి-హిందూపురం : రెండున్నర ఏళ్లుగా వార్డుల్లో కనీస అభివృద్ది జరగలేదని ఇలా అయితే వార్డుల్లో ఎలా తిరగాలని పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అద్యక్షతన కౌన్సిల్‌ సాధరణ సమావేశం జరిగింది. ఈ సందర్బగంగా ఎప్పుడు లేని విధంగా కేవలం ఆరు అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌ దృష్టికి తీసుకోచ్చారు. ఈ అంశాలపై చర్చించి సభ్యులు అజెండాను ఆమోదించారు. ఈసందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. 7వ వార్డు కౌన్సిలర్‌ నాసీర బాను తన వార్డులో ఏడాది క్రితం ప్రారంభించిన మురుగు కాలువ పనులు ఇప్పటికి పూర్తి కాలేదని, ఈ విషయాన్ని చాల సార్లు కౌన్సిల్‌ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకోచ్చినా ఫలితం లేదన్నారు. కాలువ పనులు వెంటనే ప్రారంభించే వరకు ఇక్కడే దీక్ష చేస్తానని చెప్పారు. స్పందించిన చైర్‌పర్సన్‌ ఇంద్రజ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పనులు ప్రారంభించక పోతే గురువారం నుంచి మున్సిపల్‌ కార్యలయం ముందు దీక్ష చేస్తానని కౌన్సిలర్‌ నాసీర బాను హెచ్చరించారు. ఇలా పలువురు సభ్యులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసువచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంభూపాల్‌ రెడ్డి, అన్ని విభాగాల అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు పాల్గొన్నారు.