ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో పారిశుధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలనుఏ తీవ్రతరం చేస్తామని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కమిషనర్ కార్యాలయం ముందు ధార్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌ఛార్జి కమిషనర్ ఆనంద్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఆప్కాస్ వ్యవస్థ ద్వారా 60 ఏళ్లు నిండిన వారిని బలవంతంగా ఉద్యోగులను తొలగించారని వారి స్థానంలో వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మున్సిపాలిటీ కార్మికుల కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు గ్రాట్యూటీ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్దం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంఘనాథ్, అంజినేయులు, ఆనంద్, రామచంద్రతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె లోకి వెళతామని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు హెచ్చరించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ సంఘం కార్మిక నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఉగాది పండుగకు ఒక్కొక్కరికి 5 వేలు సర్దుబాటు చేస్తామని చెప్పిన అధికారులు ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. మా సేవలను వినియోగించుకుంటున్నారే తప్ప మా సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు కూడా వేదనాలు ఇవ్వనందున పనులు నిలిపివేశారన్నారు. 15వ తేదీ వరకు వేచి చూస్తామని లేని పక్షంలో తాము కూడా నీటి సరఫరా, డ్రైనేజీ, వీధిలైట్లు నిర్వహణ పనులు నిలిపివేసి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ అకౌంటెంట్ హరికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నాగార్జున, వెంకటేశు, నరసింహులు, గోవిందు, పెద్దన్న, రామయ్య, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.










