Apr 25,2023 22:13

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగిస్తామని ఉద్యోగ ఐకాస అమరావతి సంఘం సభ్యులు, సిఐటియు శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ అన్నారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు మంగళవారం తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపుమేర సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం జీవో నెంబర్‌ ఒకటి తెచ్చి ఉద్యమాలను, సభలను నిర్వహించకుండా నిరోధిస్తోందని, ఎక్కడో మూలన పడ్డ బ్రిటిష్‌ కాలం నాటి జీవోను ఇప్పుడు ఉద్యోగస్తులపైన, ఉద్యమ కారుల పైన రుద్దుతున్నారని విమర్శించారు. దీనిని అడ్డం పెట్టుకొని పోలీసులు రోడ్లపైకి వచ్చే ఉద్యమ కారుల సభలను సమావేశాలను నిరోధిస్తున్నారని ఇలాంటి జీవోలను రద్దు చేసేంతవరకు పోరాటం చేయాలని తెలిపారు. ఉద్యోగస్తులు న్యాయమైన సమస్యలను పరిష్కారం చూపాలని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ,ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలని 12వ పేరివిజన్‌ కమిషన్‌ వెంటనే నియమించాలని కోరారు. ఉద్యోగులకు లేని పెన్షన్‌ రాజకీయ నాయకులు ఎందుకని వారు ప్రశ్నించారు. కొత్త జిల్లాలలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని పెండింగ్లో ఉన్న డిఎలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఎపి జెఎసి చేపడుతున్న పోరాటంలో ప్రజా సంఘాలు హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బయన్న, ఎపి జెఎసి ఛైర్మన్‌ మైనుద్దీన్‌, ఏపీ జెఎసి సెక్రటరీ పద్మనాభరావు, ఆర్టీసీ డిపో అధ్యక్షులు నాగార్జున రెడ్డి, ఏపీ మున్సిపల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, గ్రామ వార్డు సచివాలయ అధ్యక్షులు చౌడప్ప, జిల్లా అంధుల నిరీక్షణ సంఘం అధ్యక్షులు గంగన్న తదితరులు పాల్గొన్నారు.