Sep 14,2023 21:42

ప్రజాశక్తి - కలిదిండి
           మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ మండలంలోని మూలలంక పంచాయతీ పరిధిలో చినపుట్లపూడి ప్రాథమిక పాఠశాల భవనం శ్లాబు పెచ్చులూడి నీరు కారుతుందని, దీంతో పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. పడమటిపాలెం బ్యాంకు కాలనీలో డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం వస్తే ముంపు భయం వెంటాడుతోందన్నారు. దీనికితోడు బాలుర వసతి గృహంలోని మురుగు నీరు కలిసి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక్కడ సుమారు 50 కుటుంబాల వారు తరచూ రోగాల పాలవుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఎంపిడిఒ కార్యాలయ అధికారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు జక్కుల మహేష్‌, పి.సత్యన్నారాయణ, పి.రాజేష్‌, బి.రఘు, పి.గోపి, చింతా నాగరాజు, సిహెచ్‌.సత్తిరాజు, ఎన్‌.సీతారామయ్య, ఎన్‌.బండిరాజు, అశోక్‌, సాయి, లక్ష్మణ, భోగేశ్వరరావు, రాము పాల్గొన్నారు.