Aug 26,2023 21:06

వి.రాంభూపాల్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని మంత్రి ఉషశ్రీ చరణ్‌ స్పందించి ప్రభుత్వంతో మాట్లాడాలని సిపిఎం కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ శనివారం నాడు మంత్రికి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ లేఖ రాశారు. వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, విద్యుత్‌ కోతలను నివారించాలని, జిల్లాలో తాగునీటి పథకం కార్మికుల సమ్మెను పరిష్కరించాలనే తదితర సమస్యలను ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో మరోసారి కరువుఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. పంటలు చేతికందక గత నెల రోజులుగా మూడు రోజులకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వార్తలు రావడం ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు సహాయకచర్యలు చేపట్టాలని కోరారు. పంటల ఖర్చు ఆధారంగా కనీసం ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. వర్షాభావం వల్ల విత్తనం వేయలేని రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను రెండు వందల రోజులకు పెంచాలన్నారు. విద్యుత్‌ కోతలను ఆపి, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్యసాయి, శ్రీరామిరెడ్డి మంచినీటి పథకాల కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి కార్మికులకు రావాల్సిన పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించి వారితో సమ్మెను విరమింపజేయాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ లాంటి చట్టబద్ద సౌకర్యాలను అమలు చేయించాలన్నారు. ఇక జిల్లాలోని ఏకైకసాగునీరు వనరుగా ఉన్న తుంగభద్ర హెచ్‌ఎల్సీ కెనాల్‌ను ఆధునీకరించాలన్నారు. హెచ్‌ఎల్సీని ఆధునీకరణకు నిధులు కేటాయించడంతో పాటు నిర్థిష్ట గడువు నిర్ణయించి పనులు పూర్తి చేయాలన్నారు. హెచ్‌ఎల్సీ ఆయకట్టు కింద పంటల సాగుకు ఈ సంవత్సరం ప్రణాళికను ప్రకటించాలని కోరారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన పంట కాల్వలు తవ్వడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. రాగులపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గతంలో నిర్ణయించిన కాలువను తవ్వి తద్వారా వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల గ్రామాలకు సాగునీరు అందివ్వాలని రాంభూపాల్‌ కోరారు.