కళ్యాణదుర్గం : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, విద్యుత్‌కోతల నివారణ, ధరల నియంత్రణ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమరభేరి నిరసనల్లో భాగంగా సోమవారం నాడు తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నాయకులు ఎండగట్టారు. కళ్యాణదుర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పాల్గొని ప్రసంగించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావంతో పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల ప్రకారం పంటనష్టపరిహారం అందించాలన్నారు. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 88 సంవత్సరాల తరువాత ఆగస్టు నెలలలో అతితక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదు అయ్యిందని చెప్పారు. ప్రతి ఏడాదీ 9.22 లక్షల ఎకరాల్లో విత్తన సాగు జరుగుతుండగా వర్షాభావంతో ఈ ఏడాది కేవలం 5.62లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు సాగుచేశరని చెప్పారు. వేసిన పంటకూడా ఎండలకు ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు హెచ్‌ఎల్‌సి ద్వారా నీటిని విడుదల చేస్తే నిర్వాహణలోపం కారణంగా 12రోజుల్లో మూడు సార్లు గండిపడిందన్నారు. చాలా మంది రైతులు పంటలు పండించే అవకాశం లేకపోయిందన్నారు. మరో వైపు ప్రకృతి ప్రకోపం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అడపాదడపా నీరున్న రైతులు బోరుబావుల కింద పంటలు సాగు చేస్తే వేళాపాళలేని విద్యుత్ కోతల కారణంగా ఆ పంటలు కూడా చేతికందే పరిస్థితులు లేవన్నారు. ఈ సమస్యలపై పాకులు మొద్దు నిద్రవీడి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. అనంతరం తొమ్మిదిగంటల విద్యుత్, ప్రజాపంపిణీ ద్వారా కందిపప్పు, నూనె అందజేత, నిరుద్యోగులకు జాబ్‌క్యాలెండర్, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, పెరిగిన ధరల తగ్గింపు, విత్తనం సాగు చేయని రైతులకు రూ.30వేలు, రూ.400కే గ్యాస్‌సిలిండర్ తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌ఛార్జి తాహశీల్దార్ ఫణికుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు రంగనాథ్, వంశీ, రఘు, అశోక్, ఈశ్వర్, సోము, భవిత్, మురళి, అంజినేయులు, అమానుల్లా, సిద్దా, వెంకటేశ్, ఇస్మాయిల్, రాము తదితరులు పాల్గొన్నారు.










