May 09,2023 21:39

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎస్పీ, కలెక్టర్‌, మడకశిర ఎమ్మెల్యే

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ పథకాల వర్తింపు, ఇతర సమస్యలను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ నుంచి జగన్నకు చెబుదాం ద్వారా నేరుగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవచ్చని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ మాధవరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ నళిని, అగ్రి అడ్వైజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ రమణారెడ్డి, డిఆర్‌ఒ కొండయ్య, ఎస్పీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో అర్జీదారులకు ఎదురయ్యే సమస్యలకు మరింత నాణ్యమైన మెరుగైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ముఖ్య ఉద్దేశంగా తోడ్పడుతుందని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం క్రింద ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమస్య పరిష్కారానికైనా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేయాలన్నారు. అధికారులు సానుభూతితో కాకుండా బాధ్యతతో వ్యవహరించి స్పందన గ్రీవెన్స్‌కి వచ్చే అర్జీదారుడు సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సీఎంవో స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ఈనెల 10వ తేదీన జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ ఎన్‌.చక్రధర్‌ బాబు ఐఎఎస్‌ (ఏపీ జెన్‌ కో మేనేజింగ్‌ డైరెక్టర్‌) జిల్లాకు వస్తున్నారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి కలెక్టరేట్‌లో స్పందనపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు అధికారులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో గ్రీవెన్స్‌ వెంటనే గడువులోపు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ శాఖ తరపున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్‌, సిపిఒ విజరు కుమార్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, పిఆర్‌ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిపిఒ విజరు కుమార్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ కష్ణారెడ్డి, డిసిఒ కష్ణనాయక్‌ పాల్గొన్నారు.