May 26,2023 20:06

ముసలమడుగులో రోడ్డుపైన జరుగుతున్న సంత

సమస్యల్లో వారపు సంతలు
- స్థలాలు లేక రోడ్లపైనే నిర్వహణ
- ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు, ప్రజలు
ప్రజాశక్తి - కొత్తపల్లి

      కొత్తపల్లి మండలంలో జరుగుతున్న వారపు సంతలు సమస్యల నడుమ కొనసాగుతున్నాయి. సంతల నిర్వహణకు సరైన స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిత్యవసర సరుకులు, కూరగాయలు ఇతర వాటి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే వారపు సంతలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే వారపు సంతల్లో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు విశాలమైన స్థలాలు లేకపోవడంతో వ్యాపారులు, గ్రామాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలకు గాను మజరాలతో కలిపి సుమారు 28 గ్రామాలు ఉన్నాయి. వారంలో సోమవారం మొదలుకొని శనివారం వరకూ ప్రతి రోజూ మండలంలోని ఒక గ్రామంలో వారపు సంత జరుగుతుంది. సోమవారం మండలంలోని ఎర్రమఠం గ్రామంలో వారపు సంత జరుగుతుంది. సంతకు సరైన స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ సంతకు పాత మాడుగుల, కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్దేశ్వరం, జానాల గూడెం తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. రహదారికి ఇరువైపులా సంత జరుగుతుండడంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. మంగళవారం ఎం.లింగాపురం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన రోడ్డుపై సంత నిర్వహిస్తారు. ఈ సంతకు గోకవరం గ్రామం నుంచి ప్రజలు వస్తారు. వర్షాకాలం అయితే మురికి కుంటల మధ్యనే సంత చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బుధవారం శివపురం గ్రామంలో పాఠశాల ఆవరణంలో సంత నిర్వహిస్తారు. ఈ సంతకు శివపురం గూడెం, బట్టువారి పల్లి, సింగరాజుపల్లి గ్రామాల ప్రజలు వస్తారు. గురువారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంత స్థలంలో వ్యాపారాల నిర్వహణ చేస్తారు. సంతకు వీరాపురం గ్రామానికి చెందిన ప్రజలు వస్తారు. శుక్రవారం ముసలిమడుగు గ్రామంలో ప్రధాన సెంటర్లో ఉన్న రహదారిపై సంత నిర్వహణ జరుగుతుంది. శనివారం గువ్వలకుంట్ల గ్రామంలో రోడ్డుపై సంత నిర్వహణ జరుగుతుంది. ఈ సంతకు బండి నాయిని పాలెం, పాలెం చెరువు గ్రామాల ప్రజలు వస్తారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సంత జరుగుతుంది. ఈ సంతలకు ఆకుకూరలు, కూరగాయలు, తినుబండారాలు, నిత్యవసర సరుకులు అమ్ముకొనేందుకు వ్యాపారస్తులు వస్తారు. అయితే సంతలకు స్థలాలు లేక రోడ్లపైనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామంలో సాయంత్రం అయితే సంత రోజు మాత్రం పశువులు, పొలాలకు వెళ్లిన ఎద్దుల బండ్లు వస్తున్నప్పుడు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే లింగాపురం, ముసలమడుగు, ఎర్రమఠం గ్రామాల్లో వర్షపు నీటిలోనే సంతలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గ్రామాల్లో జరుగుతున్న సంతలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలని వ్యాపారులు, ఆయా గ్రామాల ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.

స్థలాలు లేక ఇబ్బందిగా ఉంది
రాఘవ, తినుబండారాల వ్యాపారస్తుడు.
ప్రతి రోజు గ్రామాల్లో జరుగుతున్న సంతలకు ప్రత్యేకంగా స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో రోడ్లపైనే సంతలు నిర్వహిస్తుండడం వాహనాలకు, ఎద్దులబండ్లకు, ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలం అయితే వర్షపు నీటి పక్కనే సంతల నిర్వహిస్తున్నప్పుడు ఒకవైపు వరద నీరు, మరోవైపు సంతలు జరుగుతుంటాయి. సంతల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తే బాగుంటుంది.

 

రాఘవ, తినుబండారాల వ్యాపారస్తుడు.
రాఘవ, తినుబండారాల వ్యాపారస్తుడు.