Jul 03,2023 20:58

వారపు సంత

 

రోడ్డుపై నిలిచిన వాహనాలు
రోడ్డుపై నిలిచిన వాహనాలు

సమస్యల వలయంలో సంత
- దుకాణాదారులకు, కొనుగోలుదారులకు తప్పని తిప్పలు
- పట్టించుకోని సంబంధిత అధికారులు
ప్రజాశక్తి - వెలుగోడు

      వెలుగోడు పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు సంత సమస్యల నడుమ సాగుతోంది. సంతలో కూరగాయలను విక్రయించడానికి వచ్చిన దుకాణదారులను, కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలను అనేక సంవత్సరాల నుండి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, రైస్‌మిల్లులు ఉన్నాయి. పాఠశాలలు వదిలే సమయానికి సంత మార్కెట్‌ మొదలవుతుంది. అందులో ప్రధానంగా సంతకు వచ్చిన లగేజీ ఆటోలు, పట్టణంలోని షేర్‌ ఆటోలు, పాఠశాలల బస్సులు, పాదాచారులకు, సైకిళ్ళ మీద వెళ్లే విద్యార్థులకు, రైతు కూలీల ఆటోలతో ఇటుగా వెళ్లే రహదారి అంతా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రైతులు, విద్యార్థులు, ప్రజలు, దుకాణాదారులు ఇలా అందరూ రహదారిలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారస్తుల నుండి సంత మార్కెట్‌ పన్నులు వసూలు చేస్తున్నా వారికి సరైన స్థలం చూపిండంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో సంత మార్కెట్‌ వసూలు చేస్తున్న పన్నులతోనైనా వర్షపు నీరు రోడ్డుపైన నిల్వకుండా, వాహనాల పార్కింగ్‌, సంతలో దుకాణదారులకు కాస్త మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.