Sep 08,2023 21:03

సీతానగరంలో జగనన్నకు చెబుదాం లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - సీతానగరం : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించిన ఆర్జీలకు త్వరితగిన పరిష్కారమే ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. అవకాశం ఉంటే తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ స్థాయిలో మండలంలో మొట్ట మొదటి జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. జిల్లా జిల్లా కలెక్టర్‌ స్థాయిలో మండలాల్లో నిర్వహిస్తున్న మొట్ట మొదటి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయి సమస్యలు మండలంలోనే పరిష్కారం కావాలన్నది ప్రభుత్వ అభిమతమని ఆయన వివరించారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవింద రావు, ఆర్‌డిఒ కె.హేమలత వినతులను స్వీకరించారు .జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 80 ఆర్జీలు అందాయి. స్వీకరించిన వినతుల్లో కొన్ని....
ఇప్పలవలసలో నాలుగు క్వారీలున్నాయని, 30ఏళ్ల నుంచి క్వారీ వారు మైనింగ్‌ వారికి లీజు చెల్లిస్తున్నారని, ఇప్పటివరకు మా పంచాయతీకి మైనింగ్‌ వారి నుంచి ఒక రూపాయి కూడా రాలేదని, మా పంచాయతీకి రావాల్సిన లీజు మొత్తం ఇప్పించాల్సిందిగా గ్రామ సర్పంచ్‌ చింతల లక్ష్మణరావు కోరారు. రెడ్డివానివలసకు చెందిన రెడ్డి లక్ష్మునాయుడు ఎన్‌సిఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీని రీఓపెన్‌ చేయాలని, 2023-24 సీజనకు చెరుకును సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీకి తరలిస్తే రవాణా చార్జీలు యాజమాన్యం నుండి ఇప్పించాలని కోరారు. ఇదే గ్రామానికి రెడ్డి ఈశ్వరరావు 2021 నుంచి 2023 వరకు ఆర్‌.వెంకంపేట రైతు భరోసా కేంద్రానికి ధాన్యం పంపించానని దానికి సంబంధించిన రవాణా చార్జీలు ఇప్పించాలని వినతి పత్రం సమర్పించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు 12 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం మాకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని గ్రీన్‌ అంబాసిడర్లు సింహాచలం, బి.శ్రీను దరఖాస్తు అందజేశారు. వృత్తి విద్య కోర్సుల్లో పార్ట్‌ టైమ్‌ లేబ్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని సిఇటి ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఎస్‌.రాజు దరఖాస్తు అందజేశారు. రంగంపేటకు చెందిన వై.ఈశ్వరరావు రంగంపేట గ్రామ పరిధిలో ఖాతా నెంబర్‌ 625 సుమారు 1-50 ఎకరాల భూమి 12 సబ్‌ డివిజన్‌లో తన తల్లి పేరున ఉందని, అందులో 176-13 గల సబ్‌ డివిజన్‌ 22లో పడిందని, తప్పులని సవరించాలని వినతిని అందజేశారు. పెదబోగిల గ్రామానికి చెందిన గొటివాడ.సంజీవురావు తన భార్య బ్రెయిన్‌ ట్యూమర్‌తో మరణించిందని, కుమార్తె కూడా డెంగీ తో చనిపోయిందని, తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఇల్లు లేదని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను గ్రహించి ప్రభుత్వం వారు ఉపాధి కల్పించాలని దరఖాస్తు అందజేశారు. గడ్డలుప్పికి చెందిన పోల.అప్పలనరసమ్మ 901 సర్వే నెంబర్‌ లో 50 సెంట్లు భూమి ఉందని, పొలంలో పనికి వెళ్లడానికి దారి లేదని, నా పొలానికి వెళ్లి రావడానికి దారి కల్పించాలని కోరారు. సీతానగరం గ్రామానికి చెందిన ఎస్‌.స్వర్ణలత స్లీపర్‌ వేతనాలను పెంచాలని కోరారు. పెదబోగిలి పంచాయితీ హడ్కో కాలనీకి చెందిన పైడి పద్మావతి జగనన్న గృహ నిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. మక్కువ - అజ్జాడ రహదారి మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో రహదారి పక్కన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ ను మార్చాలని, పెదభోగిలలో సులాభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌. జయమని తరపున ఎస్‌.రామారావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.