Mar 27,2023 22:54

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : సమాజంలో అనునిత్యం ఎదురవుతున్న సమస్యలతో కంగిపోకుండా ఫిర్యాదు చేయాలని, చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కారానికి జిల్లా పోలీస్‌ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ పి జాషువా అన్నారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి సహాయం కోసం పోలీసుని ఆశ్రయిస్తారని, సహానుభూతిని ప్రదర్శిస్తూ, న్యాయ పరిధిలో పరిష్కారం అందించేలా పోలీస్‌ అధికారులు కషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ఫిర్యాదుదారుల కొరకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
స్పందనలో కొన్ని ఫిర్యాదులు:
గుడివాడలో నివాసముంటున్న సరితకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం రూ 5 లక్షలు బంధువులలో ఒక వ్యక్తికి ఇచ్చి మోసపోయామని న్యాయం చేయమని ఫిర్యాదు చేసింది. వివాహమైన ప్రారంభంలో తన భర్త సక్రమంగానే చూసుకున్నాడని అయితే అత్తమామల చెప్పుడు మాటలు, ప్రలోభానికిలోనై మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నా డని న్యాయం చేయాలని పమిడిముక్కల నుండి నిర్మల ఫిర్యాదు చేసింది. అవనిగడ్డకు చెందిన నాగేశ్వరరావు అదే గ్రామానికి చెందిన చిట్టీల నిర్వాహకుడి వద్ద చిట్టీ కడుతూ డబ్బులు దాచుకున్నాడు. అయితే తన పేరు మీద చిట్టి వచ్చినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు చేశాడు. బంటుమిల్లిలోని సురేష్‌ తన నివాస స్థలంలో ఒక గదిని నిర్మించుకునే క్రమంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశాడు.