ప్రజాశక్తి - బెలగాం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకవిధానాలైన అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగం, తదితర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు తలపెట్టిన సమరభేరిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సమరభేరి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30, 31 తేదీల్లో ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ, సభలు, సమావేశాలు జరిపి సంతకాల సేకరణ చేపట్టాలని, సెప్టెంబర్ 1న సచివాలయాల వద్ద నిరసన, వినతి పత్రాలు అందజేయాలని, సెప్టెంబర్ 3న నిరుద్యోగ వ్యతిరేక దినం పాటిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు సభలు జరపాలని, సెప్టెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ ఆఫీసుల వద్ద నిరసన ధర్నాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొల్లి గంగునాయుడు, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, బంటు దాసు పాల్గొన్నారు.
సాలూరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం చేపట్టనున్న సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్వైనాయుడు కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సమరభేరి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30నుంచి సెప్టెంబర్ 4 వరకు అన్ని సచివాలయాలను కలుసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి.స్వప్న, టి.రాముడు, శంకరరావు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం మండల కన్వీనర్ డి. రమణారావు, నాయకులు కె.రాము, డి.దుర్గారావు, బి.పట్టాభి, ఎం.వీర నాయుడు, పి.ప్రభాకర్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు ప్రజల్లో ప్రచారం చేసి సెప్టెంబర్ 1న సచివాలయాల వద్ద 4న తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
గుమ్మలక్ష్మీపురం : కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సిపిఎం జిల్లా నాయకులు మండంగి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపరాయి బిన్నిడి, రాయగడ జమ్ము, దుడ్డుఖల్లు, కొత్తవలస తదితర గ్రామాల్లో ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించే సమరభేరిపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి గిరిజనుల హక్కులు, చట్టాలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇస్తూ అడవిపై పూర్తి హక్కు వారికి ఉండేలా చేయడమే నూతన అటవీ సవరణ చట్టం ఉద్దేశం అన్నారు. ఇదే జరిగితే అడవి నుంచి గిరిజనులు దూరం కావడం ఖాయమన్నారు. గిరిజనులకు వెన్నుముకగా ఉన్న జిఒ 3ను రద్దు చేసిందన్నారు. దీంతో చదువుకున్న గిరిజన నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కావున ఈసమరభేరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పువ్వల తిరుపతిరావు, ఎం సన్యాసిరావు ఉన్నారు.










