Jun 07,2023 22:01

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాను అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యసాధనను సాధించవచ్చని కలెక్టర్‌ పి.అరుణ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని బ్యాంకర్లు సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులతో డిసిసి, డీఎల్‌ఆర్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత 2022-23 సంవత్సరానికి సంబంధించి వార్షిక ప్రణాళిక రూ.8133.71 కోట్లకు గాను రూ.10,985.97 కోట్ల ప్రగతిని సాధించినందుకు అభినందించారు. జిల్లా వార్షిక ప్రణాళికలో ప్రధానంగా విద్యా, వ్యవసాయం, పరిశ్రమల స్థాపన, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.10,808.35 కోట్లతో సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాన్ని రుణ ప్రణాళికలో పరిశ్రమలు ఎంఎస్‌ఎండి రంగాలకు రూ. 1401.91 లక్ష్యానికి గాను రూ.922.85 కోట్లు, వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.4994.01 కోట్లకు గాను రూ.7353.92 , కోట్లు, విద్యారంగానికి సంబంధించి రూ.49.24 కి గాను రూ.25.3 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. హౌసింగ్‌ రుణాలకు సంబంధించి రూ.302.34 కి గాను రూ.307.73 కోట్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. బ్యాంకులకు వచ్చే రైతులకు, పారిశ్రామికవేత్తలకు అర్హత ఉన్న వారికి రుణాలు అందించడంలో ఇబ్బందులు కు గురి చేయకుండా బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన దరఖాస్తులను వివరాలను ఎప్పటికప్పుడు జాబితాలను సిద్ధం చేసుకుని రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంలో 10 తరగతిలో ఉత్తీర్ణులైన మెరిట్‌ విద్యార్థులకు విద్య రుణాలు మంజూరు చేయాలని, జన సురక్ష కార్యక్రమంలో పురోగతి సాధించాలని, స్టాండ్‌ అప్‌ ఇండియా రుణాల మంజూరులో జాప్యం చేయకుండా దరఖాస్తులను పరిశీలించి ఆయా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం కెవి.రమణ కుమార్‌, ఆర్‌బిఐ యల్‌డిఒ రెహమాన్‌, ఏపీజీబీ ఆర్‌ఒ రవీంద్రారెడ్డి, ఎల్‌డిఒ వివేకానంద, డిక్కీ మరియు ఫిక్కీ సభ్యులు రమణ , ప్రసాద్‌ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.