Jul 09,2023 08:46

ఇటీవల విడుదలైన చిత్రాల్లో మంచి హాస్యభరిత చిత్రం 'సామజవరగమన' అని చెప్పొచ్చు. చిన్న కథనే పెద్ద తెరపై పండించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. ఈ సినిమాకి మాటలు ముఖ్యంగా సెటైర్‌లు, స్కూఫ్‌లు, పంచ్‌ డైలాగ్స్‌ అన్నీ సరిగ్గా అమరాయి. మాటలు రాసిన నందు సవిరిగానకి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఈ సినిమాలో కథ ఏంటి? ఎలా ఆసక్తిగా మలిచారు? ఏయే సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి.. ఇవన్నీ వెండితెరపై చూడాల్సిందే.
ఇక కథలోకి వెళితే.. బాలు (శ్రీ విష్ణు) ఏషియన్‌ సినిమాస్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతని తండ్రి (నరేష్‌) డిగ్రీ పాసవ్వడానికి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూ ఉంటాడు. బాలు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అవసరాలు కూడా చూసుకుంటూ ఉంటాడు. తండ్రి డిగ్రీ పాసయితే వందకోట్ల ఆస్తి వస్తుంది. కానీ అతను ప్రతి ఏడాదీ పరీక్ష తప్పుతూనే ఉంటాడు. ఒకసారి పరీక్ష రాసేటప్పుడు సరయు (రెబా మోనికా జాన్‌) అనే అమ్మాయి పరిచయమవుతుంది. తన తండ్రి పరీక్ష పాసవ్వడానికి సహాయం చెయ్యమని బాలు ఆమెను కోరతాడు.
బాలు కాలేజీలో ఒకమ్మాయిని ప్రేమించి, ఆమెకి ప్రపోజ్‌ చేస్తాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి బాలుకి రాఖీ కట్టి, డబ్బులు కూడా తీసుకుంటుంది. అప్పటి నుండి బాలుకి ప్రేమంటే పడదు. అందుకని ఏ అమ్మాయి ప్రేమిస్తున్నాను అని వచ్చినా వెంటనే ఆ అమ్మాయితో రాఖీ కట్టించుకుంటాడు. ఇప్పుడు సరయు బాలుతో ప్రేమలో పడుతుంది. అయితే బాలు రాఖీ కట్టమంటాడేమో అని భయపడుతుంది. కానీ విచిత్రంగా బాలు కూడా ఆమె ప్రేమలో పడతాడు. సరయు తండ్రి ప్రేమ వివాహాన్ని ఒప్పుకోడు. అందుకని బాలు ఆమె తల్లిదండ్రుల చేత ఒప్పించి, పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఈలోగా బాలు బావకి రాజముండ్రిలో నిశ్చితార్ధం జరిగితే, దానికి బాలు కుటుంబం వెళుతుంది. పెళ్లికూతురు ఎవరో కాదు సరయుకి చెల్లెలు. తన బావ చేసుకోబోయేది సరయు చెల్లెలని తెలిసి ఒక చిక్కు వస్తుంది. బావకి పెళ్లి జరిగితే, సరయు బాలుకి చెల్లెలు వరసవుతుంది. మరి బాలు, సరయుల వివాహం జరిగిందా? బాలు తండ్రి పరీక్ష పాసయ్యాడా? ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలియాలంటే 'సామజవరగమన' సినిమా చూడాల్సిందే.

2


సినిమాలో లాజిక్‌ వదిలేస్తే, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది. కొడుకు, తండ్రిని 'ఎప్పుడు డిగ్రీ పాసవుతావు నాన్నా?' అని తండ్రి చేత చదివించటం, ట్యూషన్‌ పెట్టించడం లాంటివి హాస్యంగా ఉంటుంది. అలాగే కథానాయకురాలు తన ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉండటం, ఆ ఇంట్లో ఆమె చేసే పనులు, వాళ్ల మధ్యలో వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అలాగే బాలు తాను ఎందుకు అమ్మాయిలతో రాఖీ కట్టించుకుంటున్నాడో చెప్పే సన్నివేశం పెద్దదయినా చెప్పే విధానం బాగుంది. కొన్ని స్పూఫ్స్‌ కూడా బాగా నవ్విస్తాయి. తండ్రి పరీక్ష పాసయ్యాక రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ వస్తున్నప్పుడు తన ఆనందాన్ని పెద్దగా అరిచి చెప్పటం కడుపుబ్బా నవ్విస్తుంది. మల్టిప్లెక్స్‌లో పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌, వాటర్‌ బాటిల్స్‌ ఖరీదుల మీద సెటైర్స్‌ కూడా బాగున్నాయి. ఇంకా రెండో సగంలో వెన్నెల కిషోర్‌ పాత్ర, అన్న, చెల్లెలు సన్నివేశాలు కూడా సరదాగా ఉంటాయి. అయితే దర్శకుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా, కడుపుబ్బా నవ్వించే రీతిలో తెర మీద చూపించటం ఆసక్తికరం. ఎందుకంటే ఇందులో కథ ఏమీ ఉండదు. కానీ నవ్వుకోడానికి చాలా మెటీరియల్‌ ఉంటుంది. మొత్తం మీద దర్శకుడు రామ్‌ అబ్బరాజు మంచి పాయింట్‌ పట్టుకొని, చిన్న కథని పెద్ద తెర మీద సరదాగా నవ్వులతో ముంచెత్తాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా అంతా శ్రీ విష్ణు అనే చెప్పాలి. ఆ డైలాగ్‌ డెలివరీ, పంచ్‌, హావభావాలు, టైమింగ్‌ అన్నీ కరెక్టుగా చేశాడు. ఈ సినిమా అతనికి మంచి బ్రేక్‌ ఇస్తుందని అనుకోవచ్చు. రెబా మోనికా జాన్‌కి పెద్దగా పాత్ర లేకపోయినా బాగా చేసింది. ఆమెకి మంచి భవిష్యత్తు వుంది. చాలా రోజుల తరువాత సీనియర్‌ నరేష్‌ ఒక మంచి పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. అతనికి, శ్రీ విష్ణుకి టైమింగ్‌ సరిగ్గా సరిపోయింది. అయితే నరేష్‌ విగ్‌, మీసం మాత్రం బాగోలేదు. సుదర్శన్‌, శ్రీ విష్ణు స్నేహితుడుగా చేశాడు. అతనిదీ మంచి పాత్ర, బాగా నవ్వించాడు. రాజీవ్‌ కనకాల, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, దేవి ప్రసాద్‌, ప్రియ ఇలా చాలామంది కనపడతారు. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగానే వున్నాయి.
చివరగా, లాజిక్‌ ఆలోచించకుండా, సరదాగా, హాయిగా, అందరూ నవ్వుకోవాలి అనుకుంటే ఈ 'సామజవరగమన' ఒకసారి చూడొచ్చు. ప్రతి సన్నివేశంలోనూ హాస్యం ఉంటుంది. ఈమధ్య కాలంలో బాగా ఎంటర్‌ టైన్‌ చేసే సినిమా ఏదైనా వుంది అంటే అది 'సామజవరగమన'నే.

నటీనటులు : శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌, నరేష్‌ విజయకష్ణ, సుదర్శన్‌,
శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌, రాజీవ్‌ కనకాల, దేవి ప్రసాద్‌, ప్రియ తదితరులు
మాటలు : నందు సవిరిగాన
ఛాయాగ్రహణం : రామ్‌ రెడ్డి
సంగీతం : గోపీసుందర్‌
కథనం, దర్శకత్వం : రామ్‌ అబ్బరాజు
నిర్మాత : రాజేష్‌ దండ