May 03,2023 09:12

రాజీనామా పత్రాన్ని అందిస్తున్న ఛైర్‌పర్సన్‌ నిర్మల

         ధర్మవరం టౌన్‌: కౌన్సిల్‌ సభ్యులు, సిబ్బంది సమష్టిగా కృషితోనే ధర్మవరం మున్సిపాలిటీ అభివద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం ఛైర్‌పర్సన్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. తొలుత అజెండాలోని ప్రధాన అంశాలను మున్సిపల్‌ సిబ్బంది చదవి వినిపించగా సభ్యులంతా వాటిపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలపై కౌన్సిలర్లు గళం వినిపించారు. శివారు కాలనీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. అనంతరం ఇటీవల విధి నిర్వహణలో గాయపడిన పారిశుధ్య కార్మికుడు లింగన్న చికిత్సకు రూ. 1.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందని కౌన్సిలర్‌ గజ్జల శివ తెలుపగా కౌన్సిలర్లు వేముల జయరామిరెడ్డి, చందమూరి నారాయణరెడ్డి, గజ్జల శివ, జేసీబీ రమణ, తేజ నెల జీతం అందజేస్తామని ప్రకటించారు
ఛైర్‌పర్సన్‌గా రాజీనామా
మున్సిపల్‌ సమావేశం చివరలో ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని చెబుతూ రాజీనామా లేఖను అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. రెండేళ్ల తన పదవీ కాలంలో సహకరించి అభివద్ధి పనుల్లో భాగస్వామ్యులైన కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ఆడవారంటే వంటింటి కుందేలుగా ఉండకుండా ఉన్నత పదవులు అలంకరించాలన్న ఆకాంక్షతో తనకు అవకాశమిచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డికి రుణపడి ఉంటానన్నారు. కౌన్సిల్‌ సభ్యులు మాసపల్లి సాయికుమార్‌, గోరకాటి పురుషోత్తంరెడ్డి, తదితరులు ఛైర్‌పర్సన్‌గా లింగం నిర్మల మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిన కషిని కొనియాడారు. ఈ సమావేశంలో వైస్‌ ఛైర్మన్లు ఎర్రగుంట భాగ్యలక్ష్మి, పెణుజూర నాగరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెెడ్డితో పాటు కో అప్షన్‌ సభ్యులు, కౌన్సిల్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.