ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : సమాజంలో మార్పు రావాలంటే మహిళలకే సాధ్యమవుతుందని, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని పక్కదారి పట్టించ కుండా వారి కుటుంబ అవసరాలకే వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్లో గల మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ భవనంలో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యంతో పలు మండలాల నుంచి వచ్చిన మహిళలకు వివిధ రకాల వంటకాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు విశిష్ఠ అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే సార్తెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ బి12, ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమ్మిళితమై ఉంటాయన్నారు. ఆ బియ్యాన్ని సామర్థ్యం తెలియక తక్కువ ధరకు ఇతరులకు అమ్మితే మీకు రావలసిన ప్రయోజనం వేరే వారి చేతికి పోయినట్లేనని భావించాలన్నారు. అంతకుముందు సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మహిళల వంటల పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన మహిళలకు వరుసగా 10వేలు , 7వేలు , 4వేల రూపాయల నగదు బహుమతులతోపాటు ప్రశంసాపత్రాలను కూడా జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ పార్వతి, డి ఆర్ డి ఏ పిడి పిఎస్‌ఆర్ ప్రసాద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురు మహిళలు పాల్గొన్నారు.










