Sep 21,2023 20:54

గురజాడ అప్పారావుకు నివాళులు అర్పిస్తున్న ఐద్వా నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : సమాజంలో వివక్ష, అంటరాని తనాన్ని రూపుమాపి సమసమాజ స్థాపన జరగాలని తన రచనలతో జనజాగృతి చేసిన ఆధునిక సమాజ దార్శనీకుడు గురజాడ అప్పారావు అని ప్రముఖ రచయిత్రి శశికళ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతి వేడుకలను ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం అనంతపురం నగరంలోని ఒకటవ రోడ్డు, శారదా బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినుల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన జయంతి వేడుకల్లో రచయిత్రి శశికళ ముఖ్య అతిథిగా హాజరై గురజాడ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురజాడ అప్పారావు 1915లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తన రచనలతో సమాజాన్ని తట్టి లేపారన్నారు. సమాజంలో మార్పు రావాలని రచనలు చేశారో ఆ స్వాప్నికత ఈ రోజుకు ఇంకా నెరవేరని పరిస్థితి నెలకొందన్నారు. గురజాడ చేసిన రచనల్లో కన్యాశుల్కం ప్రధానమైన నాటకంగా నిలిచి సమాజనం నూతనోత్తేజాన్ని పొందిందన్నారు. దేశమును ప్రేమించుమన్నా, దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు అంటూ గురజాడ చేసిన సార్వజనిన సూత్రాన్ని ఆలోచిస్తే నేడు దేశభక్తితో జరుగుతున్న ఉన్మాదాలు సమాజం అర్థం చేసుకోవచ్చు అన్నారు. సమాజంలో మనుషులు మనుషులుగా బతకాలని, కులాలు, వర్ణాలు, మతాలు అడ్డురాకూదని వెలుగెత్తి చాటారన్నారు. స్త్రీ, పరుషుల సంబంధాలు స్నేహపూర్వితమైన సంబంధాలు ఉండాలని కోరుకున్నారని తెలిపారు. సమసమాజ స్థాపన జరగేందుకు గురజాడ రచనలను చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ గురాజడ అప్పారావు రచనలు సమాజాన్ని చైతన్యాన్ని చేశాయన్నారు. ఆయన రచనలను నేటి యువత చదవాల్సిన అవసరం ఉందన్నారు. 170 సంవత్సరాల క్రితమే గురజాడ ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందని చాటి చెప్పాడన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలు రాష్ట్రం, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురాజడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహాకవుల జయంతి కార్యక్రమాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించి వారిని స్మరింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, ఉపాధ్యాయులు పుల్లమ్మ, హైమావతి, సునంద, వేళాంగణి, ప్రజానాట్య మండలి నాయకురాలు క్రిష్ణవేణి, విద్యార్థినులు పాల్గొన్నారు.