Oct 09,2023 21:08

తోటపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌

కురుపాం: చే గువేరా స్ఫూర్తితో సమసమాజం కోసం యువత నడుంబిగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ తలపెట్టిన సంగ్రామ సైకిల్‌ యాత్ర సోమవారం చినమేరంగి, తోటపల్లి, ఉల్లిభద్ర పాఠశాలలను, సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోటపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేగువేరా 56వ వర్ధంతి సందర్భంగా చే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండు, రాజశేఖర్‌ మాట్లాడుతూ విప్లవ భావజాలపు యువతకు చే గువేరా ఓ యూత్‌ ఐకానని, అన్యాయాలకు, దోపిడీలకు సరిహద్దుల్లేవని, అలానే వాటి అంతం కొరకు పోరాడే విప్లవకారులకు సరిహద్దులు ఉండ కూడదని చాటిన గొప్ప విప్లవకారుడు చే అని అన్నారు. వ్యక్తికి పట్టిన వైరస్‌ను చంపడం కన్నా సమాజానికి పట్టిన వైరస్‌ను చంపడం మిన్న అని భావించి తన డాక్టర్‌ వృత్తిని వదిలి విప్లవోద్యమంలో చేరిన విప్లవ జ్యోతి చేగువేరానని తెలిపారు. సమాజంలో వస్తున్న రుగ్మతలకు వ్యతిరేకంగా యువత రాజకీయాల్లోకి రావాలని, నేటి సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు, పేద, ధనిక అనే తేడా కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. మతోన్మాద పాలనలో సమాజం నిండిపోతుందని, కులం, మతం లేని సమసమాజం కోసం యువత నడుం బిగించాలని కోరారు. చే గువేరా కోరుకున్న సమాజం కోసం చైతన్యపు కెరటం కావాలని, యువత ప్రతి విషయయాన్ని ప్రశ్నిస్తూ.. పయనిస్తూ చే వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని అలా చేసినప్పుడే చే గువేరా వారసులౌతామని నినదించారు. శపథంతో ముందుకు సాగడమే చే గువేరాకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. చేగువేరా స్ఫూర్తితో విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర డిమాండ్‌ చేస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యారంగంలో వస్తున్న అసమానతలు తొలగించాలని, విద్య కాషాయికరణను వ్యతిరేకిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చేపడుతున్న భవిష్యత్తు పోరాట కార్యక్రమాల్లో విద్యార్థులంతా పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాజు, హెచ్‌.సింహాచలం, కె.గంగారం, కె.భాస్కరరావు మరియు సైకిల్‌ యాత్ర బందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పాచిపెంట: మండల కేంద్రంలో డివైఎఫ్‌ఐ నాయకులు టి నూకరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి శ్రీను, ఆటో కార్మిక సంఘం నాయకులు పిన్నింటి రంజిత్‌ కుమార్‌, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ యువతకు చేగువేరా ఓ యూత్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందారన్నారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు పల్లి ధన, కాంత తదితరులు పాల్గొన్నారు.