Sep 13,2023 22:21

పాఠశాలను పరిశీలిస్తున్న ఎంఇఒ నాగభూషణరావు

ప్రజాశక్తి-గరుగుబిల్లి : మండల పరిధిలోని పాఠశాలలు ఎంఇఒ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. గరుగుబిల్లి ఎంఇఒ మాత్రం అందుకు విరుద్ధంగా వాదిస్తున్నారు. మండలంలో స్కూళ్లు తన పరిధిలో ఉండవంటున్నారు. డిఇఒదే బాధ్యత సెలవిస్తున్నారు. ఇదే విషయం డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా, అదేం కాదు, ఎంఇఒ పర్యవేక్షించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
నెల క్రితం నాగూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోయింది. దీనిపై ఈ నెల ఏడో తేదీన 'ప్రజాశక్తి' దినపత్రికలో 'విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం' అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ప్రహరీ కూలడం వల్ల పాఠశాలలోకి విషజంతువులు, కుక్కల గుంపులు వచ్చే ప్రమాదముందని, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల ప్రాణాలు కాపాడొచ్చని దాని సారాంశం. ఈ కథనం చూసిన ఎంఇఒ నాగభూషణరావుకు చిర్రెత్తికొచ్చింది. ప్రజాశక్తి ప్రతినిధికి ఫోన్‌ చేసి, ఆ స్కూల్‌ తన పరిధిలో ఉండదని, డిఇఒ పరిధిలోకి వస్తుందని సెలవిచ్చారు. 'ముందకేం చూశావ్‌? వెనుక ఉన్న ప్రవారీ మొత్తం కూలిపోయింద'ంటూ ఆవేశంతో ఊగిపోయారు. మండలంలో స్కూళ్లు ఎంఇఒ పరిధిలో ఉంటాయి కదా? అని ప్రశ్నించగా, సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడంటూ ఎంఇఒ దబాయించడం గమనార్హం.
ఎంఇఒ పరిధిలోనే..
ఇదే విషయమై డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ను సంప్రదించగా, మండలంలో ఉన్న పాఠశాలలన్నీ ఎంఇఒ పరిధిలో వస్తాయని ఆయన తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఏమైనా సమస్యలున్నాయని తమ దృష్టికి తీసుకొస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.