Jul 28,2023 21:02

చెరువుకు పడిన గండి

శివపురం చెరువుకు మళ్లీ గండి
- ఆరు రోజుల్లో రెండుసార్లు
- పట్టించుకోని అధికారులు
- పంట పొలాల్లోకి నీరు
- రైతులే స్వయంగా మరమ్మతులు


 

గండిని పూడ్చుతున్న రైతులు
గండిని పూడ్చుతున్న రైతులు



ప్రజాశక్తి - కొత్తపల్లి
       కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామంలో ఉన్న ఈర్ల చెరువుకు శుక్రవారం మళ్లీ గండి పడింది. వారం రోజుల వ్యవధిలోనే చెరువు కట్టకు రెండుసార్లు గండి పడడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. సంబంధిత మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదు. అధికారులు కనీసం చెరువుకు ఎక్కడ గండి పడింది..? వాటి మరమ్మతులు ఎలా చేయాలనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడంతో చెరువు నీరంతా పంట పొలాల్లోకి చేరుతోంది. రైతులు తీవ్ర ఇక్కట్లు గురవుతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆదివారం రాత్రి ఈర్ల చెరువుకు గండి పడింది. వెంటనే స్థానిక సర్పంచి చంద్రశేఖర్‌ యాదవ్‌ గ్రామస్తులు, రైతులతో కలసి సోమవారం గండిపడిన ప్రాంతాన్ని జెసిబి సహాయంతో మరమ్మతులు చేయించారు. శుక్రవారం చెరువుకు మళ్లీ గండి పడడంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే వర్షాలు కురిసి నష్టపోయిన రైతులకు మరో వైపు చెరువుకు గండిపడి పొలాలు నీట మునిగి పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులైనా స్పందించి చెరువుకు పడిన గండికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి పంట పొలాలను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.