శివపురం చెరువుకి గండి
- ఆందోళనలో ఆయకట్టు రైతులు
ప్రజాశక్తి - కొత్తపల్లి
మండలంలోని శివపురం గ్రామంలో ఉన్న చెరువుకు ఆదివారం రాత్రి గండిపడింది. దీంతో చెరువు కింద ఉన్న పొలాలు నీట మునుగుతాయని రైతులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఉన్న చెరువుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. గండిపడిన విషయం సంబంధిత అధికారులకు తెలిపినా చెరువు వద్దకు ఎవరూ రాలేదని రైతులు చెబుతున్నారు. చెరువు కింద ఉన్న రైతులు మాత్రం తమ పొలాలు నీట మునిగిపోతాయని అక్కడికి చేరుకుని గండి పడిన చోట తాతాలిక మరమ్మతులు చేపట్టారు. అయినా నిలబడక పోవడంతో నీరు వెళ్లిపోతుంది. మంగళవారం జెసిబితో వచ్చి గండిని పూర్తిగా పూడ్చుతామని రైతులు తెలిపారు.
సుమారు మూడు సంవత్సరాల క్రితం చెరువుకు గండి పడడంతో సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే మరమ్మతులు చేపట్టడం తోనే మళ్లీ గండి పడిందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి చెరువు గండికి శాశ్వతంగా మరమ్మతులు చేయాలేని, లేకపోతే చెరువు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గండి పడిన చోట తాత్కాలికంగా పూడ్చుతున్న రైతులు










