Jul 30,2023 21:13

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లబ్బి వెంకటస్వామి

శివానందరెడ్డీ.. నీ అంతు చూస్తాం
- తెలంగాణాలో పేదల ఆస్తులు కబ్జా - సొంత నిధులతో మిడ్తూర్‌లో ప్రాజెక్టు నిర్మించే దమ్ముందా..?
- రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకోవడమే చంద్రబాబు నైజం : మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
ప్రజాశక్తి - కొత్తపల్లి

     తెలంగాణ రాష్ట్రంలో పేదలు, దళితుల ఆస్తులను కబ్జా చేసిన టిడిపి నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు మాండ్ర శివానందరెడ్డి అంతు చూస్తామని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకోవడమే టిడిపి అధినేత చంద్రబాబు నైజమని మండిపడ్డారు. ఆదివారం కొత్తపల్లి మండలం శివపురం గ్రామ శివారులో వెలసిన కొలనుభారతి క్షేత్రాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో పలు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సప్త శివాలయాలను, చారు గోషిని నదిని సందర్శించారు. అనంతరం ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆస్తులను ఆక్రమించుకొని నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరులో సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మిస్తానన్న మాండ్ర శివానందరెడ్డికి దమ్ముంటే పనులు ప్రారంభించాలని, ప్రాజెక్టుకు కావాల్సిన పర్మిషన్‌ ముఖ్యమంత్రి నుంచి తాను ఇప్పిస్తానని సవాల్‌ చేశారు. 'టిడిపి ప్రభుత్వంలో నీరు-చెట్టు పనుల్లో అవినీతి చేసి కోట్లు సంపాదించిన ఘనత నీది కాదా' అని ప్రశ్నించారు. పనులు చేయడమంటే మాటలు చెప్పినంత సులువు కాదన్నారు. పేదల ఆస్తులను ఆక్రమించుకోవడంలో మాండ్ర శివానందరెడ్డికి సాటి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా చేశారా అని ప్రశ్నించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం స్వర్గీయ రాజశేఖర్‌ రెడ్డి 95 శాతం పనులు పూర్తి చేయడంతో టిడిపి ప్రభుత్వంలో ఐదు శాతం చేసి పూర్తి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనకు రావడాన్ని ప్రజలే అడ్డుకుంటారని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన ఘనత చంద్రబాబుది అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఓట్ల కోసమే ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు, శివానందరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నందికొట్కూరు పటేల్‌ సెంటర్లో నీటి ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని బహిరంగ ప్రకటన చేయాలని సవాల్‌ చేశారు. నాడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 1650 నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు. పెండింగ్లో ఉన్న 1200 ఉద్యోగాలను ఇస్తామని పటేల్‌ సెంటర్లో బహిరంగ ప్రకటన చేసే దమ్ము మీకుందా అని సవాల్‌ విసిరారు. కొలను భారతి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండి జగన్మోహన్‌ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి సుధాకర్‌ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ సుధాకర్‌ రెడ్డి, ఎంపిటిసి శివన్న, సర్పంచి బాల ఎల్లయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ మహబూబ్‌ బాషా, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహమ్మద్‌ గౌస్‌, నాగంపల్లి సొసైటీ మెంబర్‌ అచ్చిరెడ్డి, నాయకులు మహబూబ్‌ బాషా, శీను యాదవ్‌, నారాయణరెడ్డి, మున్నా, నాగలక్ష్మి రెడ్డి, నాగ ఎల్లయ్య, రామకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.