పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురంలో ఏలూరు కాలువపై నిర్మించిన ఆర్‌అండ్‌బి శాఖకు చెందిన వంతెన శిథిలావస్థకు చేరింది. గత ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఈ వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలు నేటి వరకూ నెరవేరలేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఏలూరు కాలువపై నారాయణపురం వద్ద ఉన్న ఈ వంతెన కొల్లేరు ముఖద్వారంగా చెబుతారు. గణపవరం, భీమవరం వెళ్లేందుకు ఇదే ప్రధానమైన వంతెన. బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన స్లాబు పెచ్చులూడి ఇనుప ఊచలు బయటకి కనిపిస్తున్నాయి. వంతెన పిల్లర్ వైపు నేల దిగుతోంది. చేపలు, రొయ్యలు, ధాన్యం తదితర వ్యవసాయ పంటలే కాక వాణిజ్యపరంగా భారీ వాహనాలు ఇదే వంతెన మీదుగా ప్రయాణిస్తున్నాయి. అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ వంతెన నిర్మాణానికి అధికారపార్టీతో సహా ప్రతిపక్ష నాయకులు కూడా గత 15 ఏళ్ల నుంచి హామీలు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. భీమవరంలో సిఎం బహిరంగ సమావేశంలో కూడా ఈ వంతెన నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఆర్‌అండ్‌బి, రెవెన్యూ అధికారులు సైట్ సర్వే చేసి, కొలతలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.










