Sep 25,2023 00:49

బైక్‌ జాతా చేపడుతున్న నేతలు (ఫైల్‌)

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌, పాడేరు: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నిదానంతో తెలుగువారి ఉద్యమ ఫలితంగా ఏర్పడింది. తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణ త్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగఫలంగా స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకున్నారు. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ నాణ్యమైన ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అలాంటి సంస్థను ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేయాలని మోడీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఉక్కు కర్మాగారం ఆంధ్ర ప్రదేశ్‌ లోని ప్రధాన ప్రభుత్వ రంగ యూనిట్‌. దాని ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన హానిని తలపెట్టడమే. దీనిని కాపాడుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల ఉద్యమాన్ని కనీసం పట్టించుకోలేదు. ప్రైవేటు పరం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యానికి అడ్డంకులను సృష్టిస్తూ పరిశ్రమకు నష్టాలు కలిగేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే అందులో పని చేస్తున్న సుమారు 3,500 మంది ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోల్పోతారు. భవిష్యత్తులోనూ గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే గిరిజన యువత ఉద్యోగ రిజర్వేషన్‌ కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. అలాగే స్టిల్‌ ప్లాంట్‌ లో జిల్లాకు చెందిన వందలాది మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్‌ ను కాపాడుకోవడం రాష్ట్ర ప్రజల బాధ్యత.
సిపిఎం బైక్‌ యాత్ర
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను రక్షించుకునేందుకు సిపిఎం చేస్తున్న పోరాటాల్లో భాగంగా విశాఖలో ఈనెల 20న ప్రారంభమైన బైక్‌ యాత్ర 25న సోమవారం అల్లూరి జిల్లా అనంతగిరి మండలానికి చేరుకోనుంది. మండలంలోని కాశీపట్నంలో ఉదయం 11:30 గంటలకు చేరుకుంటుంది. అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు అరకు వేలి చేరుకోనుంది. అది మధ్యాహ్నం భోజనం అనంతరం ఐటిఐ డిగ్రీ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో నాయకులు మాట్లాడుతారు. అక్కడ నుంచి డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల మీదుగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు 4:30 గంటలకు చేరుకుంటుంది. పాలిటెక్నిక్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులతో మాట్లాడతారు. రాత్రి పాడేరులో బస చేయనున్నారు. 26వ తేదీ ఉదయం జి.మాడుగుల మండల కేంద్రంలో అల్పాహారం తీసుకుంటారు. ఉదయం 10 గంటలకు చింతపల్లి మండలంలో చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చేరుకోనున్నారు. బైక్‌ ర్యాలీలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అయిన నేపథ్యం, ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధిలో అవసరం, ప్రైవేటికరణకు కేంద్ర అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు, రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు, యువతకు వివరించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడు తుండటంతో విశాఖపట్నం, విజయనగరం, పార్వతిపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలోనూ ర్యాలీ సాగనుంది.