
ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్: సిపిఎం సూచించే ప్రత్యామ్నాయ విధానాలు వ్యవసాయ రంగానికి మేలు చేకూరుస్తాయని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ సూచించే ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలకు వివరించి చెప్పేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించారు. ఆదివారం మండలంలోని కోవిలంపాడు, కంభంపాడు, చింతపూడి, ఆర్కేపల్లి, కే అగ్రహారం పంచాయతీలలో ప్రజలను, రైతులను కలుసుకుని ప్రత్యామ్నాయ విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడంతో జీవనోపాధి కోసం రైతులందరూ వలసలు పోయారని అన్నారు. వ్యవసాయం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక వ్యవసాయ రంగం తిరిగి నిలబడాలంటే సిపిఎం సూచించే ప్రత్యామ్నాయ విధానాలే సరైనవని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, రైతులకు ఉచిత విద్యుత్తు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. స్వామినాథన్, జయతీఘోష్, రాధాకృష్ణ కమిషన్ల సిఫారసులు అమలు చేస్తే వ్యవసాయ రంగం తిరిగి అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం ద్వారా వలసలు అరికట్టవచ్చునని పేర్కొన్నారు. ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యం సేకరించే పద్ధతి ప్రభుత్వాలు తీసుకువస్తే రైతులకు, వినియోగదారులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని అన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పరిశ్రమలు, గనులు, రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులే కాక ఆహార ధాన్యాల వ్యాపారం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, ఈ విధానాన్ని రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బక్కా జేసురత్నం, వై ముసలయ్య, పి ఆంటోని తదితరులు పాల్గొన్నారు.
దొనకొండ: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపెడుతున్నాయని, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించే సమయం ఆసన్నమైందని సీపీఎం మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన విజయ వాడలో సీపీఎం నేతృత్వంలో చేపట్టే ప్రజా రక్షణ భేరి కార్యక్రమం విజయవంతం నిమిత్తం ఆదివారం దొనకొండ లో కరపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తవుతున్నా విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదని, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసగించిన బిజెపీ అంతటితో ఆగకుండా రాష్ట్ర అభివృద్ధికి గుండె లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మేయటానికి సిద్ధపడిందని విమర్శించారు. బిజెపీ పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందని, బిజెపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మైనార్టీలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. మహిళలను నడిరోడ్డు మీద నగంగా ఊరేగిస్తూ సిగ్గులేకుండా అదేదో తమ ఘనత అన్నట్లు విర్రవీగుతున్న వారిని మోడీ ప్రభుత్వం సమర్థిస్తోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని నిర్మాణం పూర్తిచేయటం చేతకాక వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల జపం చేస్తున్నాడన్నారు. ఎంతసేపు నవరత్నాల గురించే తప్ప పెరిగే ధరలు, నిరుద్యోగం, కరువు ఈ ప్రభుత్వానికి కనిపించటం లేదని అన్నారు. సీపీఎం చేపట్టే ప్రజా రక్షణ భేరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కె అనీల్, సంతోష్‌కుమార్, కిరణ్‌కుమార్, శ్రీకాంత్, బెల్లం ప్రసాద్, అచ్చయ్య పాల్గొన్నారు.
పామూరు: సిపిఎం ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి అన్నారు. సిపిఎం పామూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర ప్రజల్ని నమ్మించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచిందని పేర్కొన్నారు. బిజెపి విధానాల వల్ల మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగాల్సిన ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపికి వంత పాడుతూ ఈ విధానాలను సమర్థిస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ సమయంలో ప్రజా సమస్యలను అజెండాగా మార్చి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని అందుకు సిపిఎం ప్రజా రక్షణ పేరుతో రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు ప్రచార జాతర విస్తతంగా ప్రజల్లో ఈ విధానాలు ఎండగట్టడానికి ప్రజలు పోరాటాలకు అండదండలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్, సిహెచ్ వెంకటేశ్వర్లు, శీను, నరసింహారావు, అల్లాబక్షు, మహదేవయ్య తదితరులు పాల్గొన్నారు.