Sep 28,2023 21:16

సీతాఫలాలను అమ్ముతున్న మహిళ

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : సీతాఫలం ఏజెన్సీలో దొరికే పండు. ఇప్పుడు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. బుట్టలో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. కొండలపై నుంచి వాటిని తీసుకొచ్చి మండల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సీతాఫలాన్ని తిని మధురమైన అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ తీపి. సీతాఫలం ఎంతో మధురంగా ఉండటం మాత్రమే కాదు. దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే సీతాఫలం తింటే అటు పోషకాలు అందుతాయి. గిరిజనులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆరోగ్య ప్రదాయిని సీతాఫలం
గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట మన్యంలో సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు విస్తారంగా లభిస్తుంది. సీతాఫలం బాగా మగ్గి పండుగా మారాక తినాలి. సీజన్లో రోజూ తిన్నా ఎటువంటి నష్టం లేదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. తీయని గుజ్జుతో నోరూరించే మధుర ఫలం. దీన్ని పేదోడి ఆపిల్‌ అంటారు. మామిడి ఇతర పండ్లు మాదిరిగా మగ్గబెట్టడానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాల్సిన అవసరం లేదు. కోసిన కాయలు రెండు, మూడు రోజుల్లో పండుగ మారతాయి. మాంసకృత్తులు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తరచూ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. సీతాఫలంలో అస్సలు కొవ్వు ఉండదు. సాధారణ సైజులో ఉన్న ఒక సీతాఫలాన్ని తింటే దాదాపు 200 క్యాలరీల వరకు శక్తి వస్తుంది. పండులో 4 శాతం ఐరన్‌, 2శాతం కాల్షియం, విటమిన్‌ సి 50శాతం, కార్బో హైడ్రేట్లు 48 గ్రాములు, ఫైబర్‌ 6 గ్రాములు అందుతాయి. అంటే ఇన్‌ స్టాంట్‌ ఎనర్జీ లాగా అన్నమాట. ఎప్పుడైనా నీరసంగా ఉన్న, శక్తి నశించిన వెంటనే ఓ సీతాఫలం పండు తింటే చాలు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. 100 కాయలు ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతుంది.