Sep 05,2023 22:07

కురుపాం : ఆశాలతో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

ప్రజాశక్తి - కురుపాం : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగాఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాధరావు అన్నారు. మండలంలోని మొండెంఖల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆశా కార్యకర్తల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాల్గొని ప్రతి ఆశ కార్యకర్త దగ్గర గర్భ నిర్ధారణ పరీక్ష కిట్లు ఉన్నందున ఐరిస్క్‌ గర్భిణీలను తొందరగా గుర్తించి వైద్యాధికారికి తెలియజేస్తే సరైన వైద్యం అందించవచ్చని అన్నారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సురక్షితమన్నారు. అలాగే మలేరియా, డెంగ్యూ సీజనల్‌ వ్యాధుల పట్ల ఆశ యాప్‌, మిషన్‌ ఇంద్రధనస్సు యాపిల్‌ లో అప్లోడ్‌ సక్రమంగా చేయాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ పిహెచ్‌సిలో జరిగే అబార్షన్లు, ఐయుడి, స్టిల్‌ బర్త్‌ రికార్డులు సచివాలయం వారీగా ఉంచి ప్రతి నెలా వాటిపై మీద ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్షించాలని, గర్భిణీలు, రక్తహీనతతో బాధపడుతున్న అందరికీ అవసరమైన మందులు తప్పని సరిగా అందించాలని సూచించారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం రోజున గర్భిణులు, రక్తపోటు, షుగర్‌ వ్యాధులతో బాధపడే వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మొండెంఖల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు ప్రతినెలా ఎక్కువ జరగడంతో వైద్యాధికారిని, సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో గల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మొండెంఖల్‌ పిహెచ్‌సి వైద్యాధికారి బి.ప్రజ్ఞ, సిబ్బంది శ్రీధర్‌, భారతి, నాగేశ్వరరావు, విజరు, ఆరోగ్య సహాయకులు జె.తిరుపతి పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, సిహెచ్‌డబ్ల్యూలకు వైద్యాధికారి డాక్టర్‌ ఎం.వెంకట ప్రదీప్‌ కుమార్‌ సూచించారు. ఆశా డే కార్యక్రమంలో భాగంగా రావాడ రాంభద్రపురం పిహెచ్‌సిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో జ్వరాలు, విరోచనాలు మొదలైన వ్యాధులు వచ్చిన వెంటనే వైద్య సేవలందించి వైద్యాధికారికి తెలిపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఒ సూర్యనారాయణ, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సిహెచ్‌డబ్ల్యూలు పాల్గొన్నారు.
వీరఘట్టం:గ్రామాల్లోని గర్భిణీలను గుర్తించి వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేసేలా చూడాలని స్థానిక వైద్యాధికారి జి ప్రదీప్‌ కుమార్‌ ఆశా కార్యకర్తలను ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తరచూ గ్రామాల్లో ఉండి ప్రజల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని సమాచారం ఇవ్వాలన్నారు. జ్వరాలు తమ దృష్టికి తీసుకువస్తే అక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మల్టీ పర్పస్‌ వెల్త్‌ ఇఒ జనార్ధనరావు, సూపర్వైజర్‌ శాంత కుమారి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సీజనల్‌ వ్యాధులు, హై రిస్క్‌ గర్భిణులపై శ్రద్ధ వహించాలి
భామిని : సీజనల్‌ వ్యాధులపైనా, హైరిస్క్‌ గర్భిణులపై వైద్యసిబ్బంది శ్రద్ధవహించాలని జిల్లా ఇమ్మ్యునిజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహన్‌రావు సూచించారు. మంగళవారం స్థానిక పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఒపికి వచ్చిన రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. వైద్యాధికారి డాక్టర్‌ ఫణికుమార్‌ అధ్వర్యంలో జరుగుతున్న ఆశ డే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ నెల11 నుంచి 16 వరకు నిర్వహిస్తున్న ఇంటేన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమంలో డ్రాప్‌ ఔట్‌, లెఫ్ట్‌ ఔట్‌ పిల్లలను గుర్తించి అందరికీ టీకాలు వేయాలని తెలిపారు. ఆశా కార్యకర్తల సమావేశంలో సీజనల్‌ వ్యాధులపై, హై రిస్క్‌ గర్భిణులు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ భాస్కర్‌ రావు, హెచ్‌వి గౌరీశ్వరి, ఇమ్మ్యునిజేషణ్‌ సూపర్వైజర్‌ జయ కుమార్‌, ఎఎన్‌ఎం, ఎంఎల్‌పిహెచ్‌, ఆశా, హెల్త్‌ అసిస్టెంట్‌ పాల్గొన్నారు.