Aug 18,2023 21:49
తాళ్లబురిడిలో రోడ్డుపై ఉన మురికినీటి పరిశీలిస్తున్న డిఐఒ

పార్వతీపురం రూరల్‌: సీజనల్‌ రోగాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన రావు అన్నారు. శుక్రవారం ఆయన తాళ్లబురిడి, పుట్టూరు, పెదబొండల్లిని ఆకస్మికంగా సందర్శించారు. తాళ్లబురిడిలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనారోగ్య లక్షణాలతో వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షలు, అందజేసిన మందుల వివరాల రికార్డులను పరిశీలించారు. గ్రామంలో జ్వర లక్షణాలతో ఎంతమంది ఉన్నారు, ఎంత మందికి మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అన్న అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఎప్పటికప్పుడు సర్వే చేసి జ్వరాలతో ఉన్న వారిని గుర్తించి, ప్రాథమిక దశలోనే వైద్యం అందజేస్తే తీవ్రత లేకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. అలాగే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ఆయన అక్కడ డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కోరారు. అలాగే పుట్టూరులో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరం వద్ద 104 వాహనంలో వైద్య పరికరాలు, మందులు తనిఖీ చేసి ప్రజలకు వీటిని ఆయా సందర్భాల్లో వినియోగించాలన్నారు. అనంతరం పెదబొండపల్లి పిహెచ్‌సిలో వైద్య సిబ్బందితో డాక్టర్‌ జగన్మోహనరావు సమీక్ష నిర్వహించి పలు ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి నివేదికలను పరిశీలించి పురోగతి సాధించాలన్నారు. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు డాక్టర్‌ ఐశ్వర్య, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ ధరణి, ఎఎంఓ సూర్యనారాయణ, సూపర్‌ వైజర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.