సిఎండిఎఫ్ నిధులు రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు : వంశీ
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కీలకమైన కొన్ని అభివృద్ధి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి దష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన ముఖ్యమంత్రి అభివద్ధి నిధులు(సీఎండీఎఫ్) నుంచి సత్వరమే రూ.2 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మంగళవారం తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు సాకారం కాబోతున్నాయని చెప్పారు. ఉంగుటూరు మండలంలో, తేలప్రోలు గ్రామానికి రూ.30 లక్షలతో ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఎస్.ఎస్ ట్యాంకు నిర్మాణం, రూ.25 లక్షల నిధులతో హనుమాన్ జంక్షన్‌లో కాపు కళ్యాణ మండపం, గన్నవరం బీసీ కాలనీలో రూ.20 లక్షల నిధులతో కమ్యూనిటీ హాలు నిర్మాణం, గన్నవరం టౌన్ నందు ఇస్లాంపేట, ఓసీ బ్రాహ్మణ, బీసీ ఏరియా, వెంకటనరసింహాపురం పద్మశాలీ, తెంపల్లి బీసీ కాలనీ, బాపులపాడు మండలం సింగన్నగూడెం బీసీ ఏరియాలో ఒక్కొక్కటి రూ.10 లక్షల నిధులతో నిర్మించేలా ఆరు కమ్యూనిటీ హాళ్ళు, ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో పైపులైను విస్తరణ పనులకు రూ.10 లక్షలు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడులో తాగునీటి పథకాల మరమ్మత్తులకు రూ.10 లక్షలు, బాపులపాడు మండలం కె.సీతారాంపురంలో ఎస్సీ కాలనీ మీదుగా వెళ్ళిన 11కేవీ విద్యుత్తు లైను మార్చడానికి రూ.5 లక్షలు మంజూరు చేశారని వివరించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో కాపు, తూర్పు కాపులకు రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాళ్ళు మంజూరు చేయించారన్నారు. వీటిని ఆమోదిస్తూ, పనుల నిర్వహణకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి వంశీ గన్నవరం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.










