సహకార వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు
ప్రజాశక్తి-పమిడిముక్కల
గ్రామీణ ప్రాంతాల్లో సహకార, బ్యాంకింగ్ రంగాల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు నిరంతరం కృషిచేస్తున్నామని కష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్‌పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. పమిడిముక్కల మండలంలోని మేడూరు శివారు ధూళిపూడి పాలెంలో విజయలక్ష్మి ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం నూతన భవన నిర్మాణానికి శుక్రవారం పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రూ.10వేల కోట్ల వ్యాపారాన్ని దాటి అతిపెద్ద మైలు రాయిని దాటి దేశంలోని ఐదో అతిపెద్ద డిసిసిబిగా గుర్తింపు పొందిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తూ సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. గతేడాది రూ.34 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42 కోట్లు నికర లాభాన్ని సాధించిందన్నారు. తాము బాధ్యతలు చేపట్టే నాటికి రూ.7వేల కోట్లు టర్నోవర్ ఉండగా ఈ 20 నెలల కాలంలో రూ.10వేల కోట్లకు తీసుకెళ్లామన్నారు. బ్యాంక్ ద్వారా అందిస్తున్న పారదర్శక సేవలకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో అవార్డులు పొందామన్నారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడు జిల్లాల పరిధిలో పనిచేస్తోందన్నారు. జిల్లాల్లోని 425 సహకార సంఘాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.45 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి సహకార సంఘానికి సొంత భవనం ఏర్పాటు చేసి మినీ బ్యాంకు మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి విత్తనం నుంచి విక్రయం వరకూ వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి సిఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. కృష్ణాజిల్లాలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన రుణ సదుపాయం అందుతోందన్నారు. విజయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు అరిగే శివరామకృష్ణ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారని తన్నీరు నాగేశ్వరరావు, కైలే అనిల్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడూరు గ్రామ సర్పంచ్ గొరికిపూడి స్వర్ణలత, పమిడిముక్కల మండల పరిషత్ ఉపాధ్యక్షులు గంజాల సీతారామయ్య, వైసిపి మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వైసిపి నాయకులు అజీజ్, పువ్వాడ రవి, రంగరాజు తదితరులు పాల్గొన్నారు.










