ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సహకార సంఘాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం పూనుకొందని, పిఎసిఎస్ ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఈనెల 17న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ తెలిపారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సహకార సంఘాల ఉద్యోగులతో కలిసి ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పిఎసిఎస్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సహకార సంఘాలలో 50 శాతం వాటాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వైసిపి ప్రభుత్వం సహకార సంఘాల చట్టానికి సవరణ చేసిందన్నారు. అలాగే ఈ సంఘాలను రైతు భరోసా కేంద్రాలలో విలీనం చేస్తూ మరో సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదించిందన్నారు. దీనివల్ల సహకార సంఘాల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీంతో రైతులు కూడా ఇబ్బందులు పడతారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేస్తున్నాయన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టే ధర్నాల్లో రైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










