ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ సహకార సంఘాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్య క్షుడు ఇంతియాజ్, కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కో ఆపరేటివ్ సొసైటీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2050 ప్రాథమిక సహకార సంఘాల్లో 7500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. వారందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 62 ఏళ్ల సర్వీసు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే పిఎసిఎస్‌లలో 50 శాతం వాటాలను ప్రయివేటు కంపెనీలు, వ్యక్తులకు ఇస్తూ రైతు భరోసా కేంద్రాల్లో విలీనం చేస్తూ చేసిన చట్ట సవరణలు రద్దు చేయాలన్నారు. జీవో 36, జీవో 90 ప్రకారం వేతనాలతోపాటు ఇతర బెనిఫిట్స్ లను వెంటనే అమలు చేయాలని, ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగించాలని, సహకార సంఘాలకు ఆదాయపన్ను పూర్తిగా మినహాయించాలని, ఇప్పటికే బ్యాంకులు వసూలు చేసిన టిడిఎఫ్ మొత్తాలను తిరిగి సంఘాలకు జమ చేయాలన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ అరుణ్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు బొజ్జప్ప, కృష్ణారెడ్డి, మహేష్‌బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్, సిపిఎం నాయకులు బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంతియాజ్










