పుట్టపర్తి రూరల్ : సహకార సంఘాల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, సహకార సంఘాల ఉద్యోగులతో కలిసి ఉద్యమం చేపడుతామని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సహకార సంఘాల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం పుట్టపర్తిలో పిఎస్‌సిఎస్ ప్రధాన కార్యదర్శి జె.హరికష్ణ అధ్యక్షతన రైతులు, కౌలు రైతులు, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టిందని, దానికి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించామన్నారు. కేంద్ర సహకార సంఘాల్లో 50% వాటాను ప్రయివేటీకరణకు కేటాయించాలన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్‌లో ఆమోదించిందని, తద్వారా రైతులకు రుణ సదుపాయంతో పాటు గతంలో లభించే సౌకర్యాలు దూరమవుతాయన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని 52 సొసైటీల్లో రైతులు, సహకార సంఘాల ఉద్యోగులతో కలిపి ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఇంతియాజ్ మాట్లాడుతూ రైతులు, కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సదస్సులో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగాలపల్లి పెద్దన్న, బడా సుబ్బిరెడ్డి, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, పిఎస్‌సిఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి జె.హరికష్ణ, పిఎసిఎస్ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు.










