Nov 02,2021 11:01

న్యూఢిల్లీ :  22 లక్షలకు పైగా భారత ఖాతాలపై సెప్టెంబర్‌లో వాట్సప్‌ నిషేధం విధించింది. ఫిర్యాదుల నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌లో 560 ఫిర్యాదులు అందాయని.. దీంతో 22 లక్షలకు పైగా ఖాతాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఫోన్‌ నంబర్లకు ముందు 91 ఉన్న వాటిని భారతీయ ఖాతాలుగా గుర్తించవచ్చని పేర్కొంది. ఎండ్‌-టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌తో సమాచార దుర్వినియోగాన్ని అరికట్టడంలో వాట్సప్‌ అగ్రస్థానంలో ఉందని వాట్సప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. వినియోగదారుల సమాచార భద్రత కోసం గతకొన్ని ఏళ్లుగా కృత్రిమ మేధస్సు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచార శాస్త్రవేత్తలు, నిపుణులను వినియోగించామని అన్నారు. ఐటి చట్టం ప్రకారం.. నెలవారీ నాల్గవ నివేదికను సెప్టెంబర్‌లో విడుదల చేసినట్లు తెలిపారు. వినియోగదారుల భద్రతా నివేదికలో స్వీకరించబడిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు నివారణ చర్యలను చేపట్టిందని అన్నారు.