ప్రజాశక్తి- రొళ్ల : కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరలు వింటే చాలు సామాన్య ప్రజల గుండె గుబేల్ మంటోంది. టమాటా, పర్చిమిర్చి ధరలు సెంచరీ దాటేశాయి. రొళ్లలో టమాటా ధర రూ.100, పచ్చిమిర్చి రూ.140 ధర పలుకుతున్నాయి. మిగిలిన కూరగాయల ధరలు రూ.40కి తక్కువ లేవు. రెండు నెలల నుంచి ఎండలు మండిపోవడంతో స్థానికంగా కూరగాయ పంటలు తగ్గటంతో కూరగాయల దిగుమతి తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
గత రబీలో సాగు చేసిన టమాటా పంట ఏప్రిల్లోనే పూర్తయ్యిందని అవసరాల కోసం అప్పటి నుంచి కర్నాటక రాష్ట్రం తుమకూరు, సిర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని హోల్‌సేల్ వర్తకులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరలో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్కెట్లో 25 కిలోల బాక్స్ రూ.50లు పలకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు రైతులు టమాటాలను కోయకుండా పొలంలోనే వదిలేశారు. ఆతరువాత ఎండలు విపరీతంగా పెరగడం, ఇదే సమయంలో అకాల వర్షాలు పడడంతో టామాటా తోటలు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం మే మొదటి వారంలో హోల్‌సేల్ మార్కెట్లో టమాటాల 25 కేజీల బాక్స్ రూ.150 ధర వుంది. రిటైల్‌లో కిలో రూ.10 చొప్పున విక్రయించారు. తరువాత క్రమేపీ పెరుగుతూ అదే నెల చివరినాటికి కిలో రూ.30కు చేరుకుంది. జూన్‌లో మరింత పెరుగుతూ వచ్చింది. మొదటి వారంలో కిలో రూ.35కు, రెండో వారంలో రూ.40కి, మూడో వారంలో 50కి, చివరి వారంలో ఏకంగా రూ.100కు చేరింది. ప్రస్తుతం రొళ్లలో టమోటా బాక్స్ రూ.1.700 నుంచి రూ.2 వేలు పలుకుతోంది. రవాణా, కళాసీల ఛార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఒక్కో బాక్స్ రూ.1,800 నుంచి రూ.2,100 రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నామని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పచ్చిమిర్చి ధర కూడా గణనీయంగా పెరిగింది. మార్కెట్లో రిటైల్‌లో కిలో రూ.140కి విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి పంటను చాలా ఎక్కువ సాగు చేస్తుంటారు. అది కూడా ఏప్రిల్లో పూర్తవడంతో. మండల అవసరాల కోసం కర్నాటక ప్రాంతాల నుంచి పచ్చిమిర్చిని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కూడా పంట తగ్గిపోవడంతో కర్నాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వర్తకులు చెబుతున్నారు. అక్కడే కిలో రూ.100 పడుతోందని అంటున్నారు. నెల రోజుల క్రితం పచ్చిమిర్చి కిలో రూ.50 వుండగా, ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. అల్లం ధర చుక్కలను తాకుతోంది. రకాన్ని బట్టి కిలో రూ.200 నుంచి రూ.240 అమ్ముతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు సైతం క్రమేపీ పెరుగుతున్నాయి. బీరకాయలు కిలో 80, బెండకాయలు రూ.50, దొండకాయలు రూ.40, వంకాయలు రూ.40 పలుకుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.










