Sep 24,2023 19:39

సచివాలయ ఉద్యోగులకు ఒక్కరోజు సెలవుకావాలన్నా నరకమే
కామరవరపుకోట మండలంలో పరిస్థితి దారుణం
ఎంపిడిఒను కలిసి సంతకం పెట్టించుకుంటనే సెలవు మంజూరు
ఫోన్లో, వాట్సాప్‌లో చెబితే చెల్లదంటూ మండలాధికారి ఆదేశాలు
మండల పరిషత్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ తీరుపై విమర్శలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

సచివాలయ ఉద్యోగులు సెలవుకోసం పడుతున్న అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఒక్కరోజు సెలవు కావాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పలుచోట్ల సచివాలయ ఉద్యోగుల సెలవు దరఖాస్తుపై ఎంపిడిఒలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పలువురు ఎంపిడిఒలు వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. కామవరపుకోట మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మండలంలో 15 గ్రామ సచివాలయాలున్నాయి. దాదాపు 150 మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ మండలంలో సచివాలయ ఉద్యోగులకు సెలవుకావాలంటే నానాఅవస్థలు పడుతున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిబంధనల ప్రకారం సచివాలయ ఉద్యోగులు సెలవు కావాలంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీ(డిడిఒ)కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆయన అంగీకరించిన తర్వాత సంబంధిత శాఖ మండలాధికారికి వెళుతుంది. అంటే ఎఎన్‌ఎంలు అయితే పిహెచ్‌సి డాక్టర్‌కు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అయితే మండల వ్యవసాయాధికారికి ఇలా సంబంధిత శాఖ అధికారికి సెలవు దరఖాస్తు చేరుతోంది. గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 సెక్రటరీలకు సంబంధించి సెలవు దరఖాస్తులు మాత్రమే ఎంపిడిఒ పరిధిలోకి వెళ్తాయి. మిగిలిన శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవు దరఖాస్తులు డిడిఒ, సంబంధిత శాఖ మండలాధికారి మంజూరు చేస్తే సరిపోతుంది. కామవరపుకోట మండల పరిషత్‌ కార్యాలయ అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డిడిఒ, సంబంధిత శాఖ మండలాధికారి సెలవు మంజూరు చేసిన తర్వాత కూడా నేరుగా ఎంపిడిఒను కలిసి సెలవు దరఖాస్తుపై సంతకం తీసుకోవాలని నిబంధన విధిస్తున్నారు. కామవరపు కోట మండలాధికారులు దీనిపై ప్రత్యేకంగా ఆర్డర్‌ జారీచేసిన పరిస్థితి సైతం నెలకొంది. ఎంపిడివో అనుమతి తీసుకోకపోతే జీతంలో కోత విధించాల్సి ఉంటుందంటూ ఎంపిడిఒ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. సెలవుకోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటల తర్వాత మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లి ఎంపిడిఒ సంతకం తీసుకోవాలని చెప్పడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మండల కేంద్రాలకు పలు గ్రామాల సచివాలయాలు 20 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్నాయి. సెలవుకోసం సాయంత్రం ఐదుగంటల తర్వాత మండల పరిషత్‌కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టించుకోవాలని చెప్పడం ఏ విధంగా సమంజసమంటూ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఫోన్‌చేసినా, వాట్సాప్‌లో సమాచారమిచ్చినా చెల్లదంటూ ఎంపిడిఒ జారీచేసిన ఆర్డర్‌లో పేర్కొనడం గమనార్హం. ఈ మండంలోని సచివాలయ ఉద్యోగులు సెలవు కావాలంటే నానాయాతన పడుతున్నామంటూ ఉద్యోగులు చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడలేక ఆరోగ్యం బాగోలేకపోయినా విధులు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ వ్యవహర శైలి సైతం ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షాడో ఎంపిడిఒగా జూనియర్‌ అసిస్టెంట్‌ వ్యవహరిస్తూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. సెలవు విషయంలో కామవరపుకోట ఎంపిడిఒ కార్యాలయ వ్యవహరిస్తున్న తీరుతో సచివాలయ ఉద్యోగులు విసిగిపోతున్నారు. ఆన్‌లైన్‌లో సెలవుకోసం దరఖాస్తు చేసిన తర్వాత మళ్లీ ఎంపిడిఒను కలిసి సంతకం తీసుకోవడం నిబంధనల్లో ఉందా అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల సెలవు దరఖాస్తులకు సంబంధించి ఉన్నతాధికారులు ఎంపిడిఒలకు కచ్చితమైన ఆదేశాలు జారీచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సెలవులతోపాటు, పలు సమస్యలపై కామవరపుకోట మండలానికి చెందిన సచివాలయ ఉద్యోగులు ఆదివారం స్థానిక ఎంఎల్‌ఎ ఎలిజాను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. సెలవు మంజూరులో సమస్యలపై కామవరపుకోట ఎంపిడిఒ శ్రీదేవిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.