Aug 28,2023 21:52

సెల్‌టవర్‌పై ఉన్న ఆర్‌ఎంపి వైద్యుడు వెంకటేష్‌

          ప్రజాశక్తి-పుట్లూరు   సైబర్‌ నేరాగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన డబ్బులను రికవరీ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, న్యాయం చేయాలని ఓ ఆర్‌ఎంపి వైద్యుడు సెల్‌టవరెక్కి నిరసన తెలిపాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎ.కొండాపురం గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడు, పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎ.కొండాపురం గ్రామానికి చెందిన వెంకటేష్‌ ఆర్‌ఎంపి వైద్యునిగా పని చేస్తున్నాడు. గతేడాది ఇతని సెల్‌కు ఓ సందేశం వచ్చింది. మీకు లక్కీడిప్‌లో కారు తగిలింది అనేది ఆ సందేశం సారాంశం. దీంతో ఆయన మేసేజ్‌ వచ్చిన నెంబర్‌తో మాట్లాడారు. కారు బహుమతిగా వచ్చిన మాట వాస్తవమే అని, దానిని పొందాలంటే కొంత ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు. దీంతో ఆయన పలు దఫాలుగా రూ.15 లక్షల వరకు వారు చెప్పిన ఖాతాలకు జమ చేశారు. కొద్ది రోజుల తరువాత వారి నెంబర్లు అన్నీ పని చేయకుండా పోయాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన పుట్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2022 సెప్టంబర్‌ 20వ తేదీన ఈయన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను మోసపోయిన డబ్బులను ఇప్పించడంలో పోలీసుల విచారణ సరిగా లేదన్న మనస్తాపంతో ఆర్‌ఎంపి వైద్యుడు వెంకటేష్‌ సోమవారం ఉదయం అదే గ్రామంలోని సెల్‌టవర్‌ ఎక్కాడు. తనకు న్యాయం చేయకపోతే అక్కడి నుంచి దూకి చనిపోతానంటూ తెలిపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతనితో సెల్‌ద్వారా మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కిందకు దింపారు. అనంతరం ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్‌ఎంపి వైద్యుడు ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. దీనిపైనా దర్యాప్తు చేపట్టి, బ్యాంకుఖాతాల్లో ఉన్న రూ.2 లక్షలను ఫ్రీజ్‌ చేయించామని చెప్పారు. తదుపరి విచారణ కూడా కొనసాగుతోందన్నారు.