Jun 07,2023 22:18

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ టిఎస్‌ చేతన్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు సంబందించి త్వరగా నష్టపరిహారం అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ లోని తన చాంబరు లో ఎన్‌ హెచ్‌, ఆర్‌ అండ్‌ బి, సర్వే, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారుల కోసం ఆయా మండలాల పరిధిలో సేకరించి అవార్డు పాస్‌ చేసిన భూములకు త్వరగా నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జరుగుతున్న పనుల పురోగతిపై పుట్టపర్తి, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు తహశీల్దార్లతో ఆరా తీశారు. ప్రతివారం సమీక్ష జరుగుతుందని పెండింగ్‌ లో ఉన్న పనులు వేగవంతం చేయాలని అన్నారు. రహదారుల కోసం అటవీ భూమి సేకరించి ఉంటే అందుకు రెట్టింపు భూములు అడవి శాఖకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 136.62 హెక్టార్ల విస్తీర్ణానికి రూ. 18.27 కోట్లు మంజూరు అయిందని చెప్పారు. ఇప్పటికే 80.41 హెక్టార్ల విస్తీర్ణానికి రూ. 12.90 కోట్లు అందజేశామని అన్నారు. ఈ రహదారులు పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని చెప్పారు. నష్ట పరిహారం చెల్లింపులో ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తే పెండింగ్‌ లో ఉన్న నష్టపరిహారం అందించడానికి వీలు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఎన్‌హెచ్‌ ఎస్‌ఇ మురళీమోహన్‌, డిఎఫ్‌ఒ రవీంద్రనాథ్‌ రెడ్డి, సర్వే ఏడీ రామకృష్ణ, ఆయా మండలాల తహశీల్దార్లు ్ల పాల్గొన్నారు.