ప్రజాశక్తి-అవనిగడ్డ: ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఆవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అవనిగడ్డ సబ్ జోన్ ఆటల పోటీలను శనివారం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనడం ద్వారా శారీరక దఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతాయని చెప్పారు. దీంతోపాటు క్రీడల్లో రాణిస్తే జాతీయ ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని దీనితో మంచి భవిష్యత్తు ఉన్నతమైన జీవితం లభిస్తుందన్నారు. అదేవిధంగా పోటీ తత్వం పెరిగి విజయం సాధించాలని సంకల్పం ఏర్పడుతుందన్నారు. గెలుపు వాటములను తేడాస్పూర్తితో స్వీకరించాలని ఎమ్మెల్యే సూచించారు. అవనిగడ్డ సబ్ జోన్ పరిధిలో జరిగే ఈ పోటీలలో అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మువ్వ మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన పోటీలలో లాంగ్ జంప్ లో అవనిగడ్డ నారాయణ విద్యాసంస్థలు చెందిన చాణిక్యవర్ధన్ మొదటి స్థానం సాధించగా, కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కే సుబ్రహ్మణ్యం ద్వితీయ స్థానం సాధించగా, పులిగడ్డ ఏపీ ఆర్ ఎస్ విద్యార్థి కే నవనీత్ తతీయ స్థానం సాధించాడు. ఈ పోటీలను ఏడు మండలాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించారు.










