న్యూఢిల్లీ : మన సౌర వ్యవస్థకి వెలుపల అతి పెద్దవైన 301 గ్రహాలు వాటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు. ఈ సరికొత్త ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందన్న కోణంలో జరుగుతున్న పరిశోధనలను మన శాస్త్రవేత్తలు బలోపేతం చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఖగోళ- భౌతిక .జర్నల్లో ప్రచురించారు. ఇప్పటికే కనుగొన్న 4,569 గ్రహాల జాబితాలో వీటిని కూడా చేర్చారు. సౌర వ్యవస్థకి ఆవల నక్షత్రాలను కక్ష్యలో ఉంచే ఇవి కొన్ని భూమిలా, మరికొన్ని జుపిటర్లా, మరికొన్ని నెప్టూన్లా మాదిరిగా పరిమాణం, ద్రవ్యరాశి, లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే ఒకేసారి 301 పెద్ద గ్రహాలను శాస్త్రవేత్తలు ఎలా గుర్తించగలిగారు అంటే ఎక్సో మైనర్ అనే తీవ్రమైన న్యూరల్ నెట్వర్క్ కారణంగా ఈ ఆవిష్కరణ సాధ్యమైంది. నాసా శాస్త్రవేత్తలు మెషీన్ లెర్నింగ్ సిస్టమ్ అయిన ఈ ఎక్సోమైనర్ని సూపర్ కంప్యూటర్లో సౌరవ్యవస్థకి అవతల వున్న గ్రహాలను గుర్తించేందుకు వినియోగిస్తారు. కొన్నేళ్లపాటు జరిగిన అధ్యయనంతో పోలిస్తే.. ఈ ఎక్సో మైనర్ శాస్త్రవేత్తల పరిశోధనను మరింత సులభతరం చేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా గ్రహం అవునా కాదా అన్న వివరాలను సమగ్రంగా అందిస్తుంది. కెప్లర్ అంతరిక్ష నౌక, కె2 ద్వారా సేకరించిన సమాచారం ద్వారా ఎక్సో మైనర్ పనిచేస్తుంది. మొత్తం 301 గ్రహాలను కెప్లర్ సైన్స్ ఆపరేషన్స్ సెంటర్ మొదట గుర్తించిందని, కెప్లర్ సైన్స్ ఆఫీస్ ద్వారా ప్లానెట్ల స్థానంలోకి చేర్చారని నాసా తెలిపింది. అయితే ఎక్సో మైనర్ కు ముందు ఎవరూ వీటిని గ్రహాలుగా ధ్రువీకరించలేకపోయారని అన్నారు.










