ప్రజాశక్తి - ఆదోని
ప్రతి ఒక్కరూ సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శంకరయ్య తెలిపారు. జెవివి ఆధ్వర్యంలో సైన్స్ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న చెకుముకి పోటీల గోడపత్రికలను నెహ్రూ మెమోరియల్, మున్సిపల్ హైస్కూల్‌లో సోమవారం విడుదల చేశారు. మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున, హలీం సిద్ధికి మాట్లాడారు. జెవివి చెకుముకి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచి, కుతూహలం ఏర్పడి భవిష్యత్తు తరాలు శాస్త్రీయ దృక్పథం గల సమాజంగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. జెవివి జిల్లా అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ... జెవివి 33 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెకుముకి సైన్స్ పోటీల్లో విద్యార్థులు పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని, పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షకు నామమాత్రపు రుసుం రూ.10 చెల్లించి ఉంటుందని తెలిపారు. నవంబర్ 10న పాఠశాల స్థాయి పరీక్ష ఉంటుందని, పాఠశాల స్థాయి విజేతలు నవంబర్ 30న జరిగే మండల స్థాయి పరీక్షకు అర్హత సాధిస్తారని చెప్పారు. మండల స్థాయి విజేతలు జిల్లాస్థాయి పరీక్షకు, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్రస్థాయి పరీక్షకు అర్హత సాధిస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు గాదిలింగప్ప, శ్రీనివాసులు, రామాంజనేయులు, నరసయ్య గౌడ్, రంగన్న, దావీదు, రాఘవేంద్ర, మల్లికార్జున ఉన్నారు.
గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు










