Jul 19,2023 22:44

నగదు పంపినట్లు స్టేట్‌మెంట్‌ చూపుతున్న బాధితుడు

ప్రజాశక్తి - చిలమత్తూరు : సైబర్‌ మోసగాళ్లు చేతుల్లో రోజు ఎంతో మంది అమాయకులు బలై పోతున్నారు. రుణాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలిప్పిస్తాం అంటూ ఫోన్‌పే, గూగూల్‌ పే వంటి వంటి యాప్‌ల ద్వారా డబ్బులు వేయించుకోవడం మొదలు ఎఇపిఎస్‌ ద్వారా నకిలీ వేలి ముద్రలు తయారు చేసి అకౌంట్‌ లో ఉన్న డబ్బులు స్వాహా చేయడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌నేరగాళ్లు సరికొత్త మోసాన్ని ఎంచుకున్నారు. కరోనా సమయంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలను టార్గెట్‌ చేసి పరిహారం వచ్చింది. ఇంత డబ్బులు మీరు చెల్లించాలని పోన్‌ చేసి పేమెంట్‌ థర్డ్‌ యాప్స్‌ ద్వార డబ్బులు వేయించుకొని మోసం చేసిన సైబర్‌ మోసగాళ్లు తాజాగా యాక్సిడెంట్‌ అయిన కుటుంబాలను టార్గెట్‌ చేసి వారి డబ్బులను దోచేస్తున్నారు. ఇలాంటి సంఘటన చిలమత్తూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
చిలమత్తూరు తహశీల్దార్‌ నాగరాజుకు బుధవారం ఓ పోన్‌ కాల్‌ వచ్చింది. మీ ప్రాంతంలో ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్‌ వివరాలు చెప్పండని ఫోన్‌చేసిన వ్యక్తి తహశీల్దార్‌ను కోరాడు. దీంతో తహశీల్దార్‌ ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్‌ అయిన వారి వివరాలు ఇవ్వాలని చిలమత్తూరు వీఆర్వోకు చెప్పారు. వీఆర్వో వద్ద వివరాలు సేకరించిన ఆ వ్యక్తులు గత నెల 24న టేకులోడు క్రాస్‌ లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంబందించి పాతచామలపల్లిలోని వ్యక్తులకు ఫోన్‌ చేశారు. ఆర్‌ ఆండ్‌ బి నుంచి పరిహారం రూ. 6. 25 లక్షలు వస్తుందని ఈ నెంబర్‌ కి ఆధార్‌ కార్డ్‌ ,బ్యాంక్‌ డిటైల్స్‌ పంపమని కోరారు. దీంతో బాధితులు వారు చెప్పినట్లు 9606315097 ఫోన్‌నెంబరుకు వివరాలు పంపారు. వెంటనే అవతలి వ్యక్తులు తిరిగి ఫోన్‌ చేసి పంపిన వివరాలు లో కొన్ని తప్పులు ఉన్నాయని వాటిని సరిచేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. ఆ డబ్బులు చెల్లిస్తే మొత్తం డబ్భులు ఖాతాలో జమ చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన మృతుని బంధువు మాజీ ఎంపిటీసి జి శివప్ప 16,470 రూపాయలు పోన్‌ పే ద్వార పంపాడు. అలాగే మరో మృతుడు కుటుంబసభ్యుడు బాలచంద్రారెడ్డి రూ. 16,500 రూపాయలు పోన్‌ పే ద్వారా పంపారు. అయితే ఎంతసేపటికి డబ్బులు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో తిరిగి పోన్‌ చేస్తే ఆ పోన్‌ నెంబర్లు స్విచ్‌ ఆప్‌ వచ్చాయి. దీంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు తహశీల్దార్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన సూచనల మేరకు బాధితులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు సైబర్‌సైట్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
సైబర్‌ నేరగాళ్లు అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి బాధితులను మోసగించి డబ్బులను స్వాహా చేసిన ఘటన గ్రామంలో చర్చనీయంశంగా మారింది. బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.