ప్రజాశక్తి- దేవనకొండ
శాస్త్రీయ పద్ధతులతో గొర్రెలు, మేకల పెంపకంలో లాభాల బాట పట్టవచ్చని కర్నూలు డివిజన్ పశు వైద్య ఉపసంచాలకులు డాక్టర్ దుర్గా ప్రసన్న బాబు తెలిపారు. సన్న జీవాల పెంపకందారులు మందలో విత్తన పొట్టేళ్లను జన్యు సంబంధం లేని వేరే మంద నుంచి తీసుకొని పెంచితే మంచి పిల్లలు పుట్టి మరణాలను అరికట్టవచ్చని చెప్పారు. శుక్రవారం గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గోనెగండ్ల ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సకాలంలో నట్టలమందు, టీకాలను వేసుకుంటే జీవాల్లో మరణాలు తగ్గి లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. గొర్రెల పెంపకం దారుల శిక్షణ కేంద్రం ప్యాపిలి రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ రామసుబ్బారెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్ జానకి, పశువైద్యాధికారి ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులకు యాజమాన్యంపైనా, బ్రీడింగ్‌పైనా, మేత మేపే విధానాలపైనా అవగాహన కల్పించారు. మండల పశువైద్యాధికారులు డాక్టర్ అనిలా, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ వీరేష్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న పశు వైద్య అధికారులు










