ప్రజాశక్తి-ఆలూరు/హోళగుంద
దేవరగట్టులో వెలసిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా బన్ని ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. శనివారం ఆలూరు ఎంపిడిఒ కార్యాలయంలో దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో బన్ని ఉత్సవాల సందర్భంగా సబ్ డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దసరా బన్ని ఉత్సవాల సందర్భంగా భక్తులకు, ప్రజలకు అన్ని వసతులూ కల్పించాలని కోరారు. దేవరగట్టు ప్రాంతం మొత్తం ప్రకాశవంతంగా ఉండేందుకు ఎత్తయిన లైట్లు, జనరేటర్ ఏర్పాట్లు చేస్తూ, తాగునీరు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ రఘువీరా రెడ్డిని ఆదేశించారు. ఈ ఉత్సవాల్లో మద్యాన్ని వాడకుండా, కర్రలు తీసుకొని రాకుండా, సాంప్రదాయబద్ధంగా, క్రమశిక్షణతో జరుపుకోవడానికి పరిసర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలని డీఎస్పీకి సూచించారు. రాత్రిపూట స్పష్టంగా కనిపించే కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక శక్తులు, క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం దేవరగట్టులోని శ్రీమాలమల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని క్షేత్రస్థాయిలో స్థల ప్రాంతాన్ని పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తికొండ ఆర్‌డిఒ మోహన్ దాస్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ హుస్సేన్ సాబ్, ఆర్‌ఐ దినోజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మహ్మద్ షఫీ, విఆర్‌ఒ నాగరాజు, విద్యుత్ ఇఇ సుధాకర్ బాబు పాల్గొన్నారు.
దేవరగట్టులో పర్యటిస్తున్న అభిషేక్ కుమార్










