ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలో దళితులపై కొనసాగుతున్న అంటరానితనం, సామాజిక అసమానతలపై పాలకవర్గాలు, అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేకపోతే దళిత, గిరిజన, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టి ప్రతిఘటిస్తామని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్ బాబు హెచ్చరించారు. మంగళవారం కౌతాళంలోని రైతు సంఘం కార్యాలయంలో మండల అధ్యక్షులు హెచ్.చిన్న మారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆనంద్ బాబు, కెవిపిఎస్ జిల్లా నాయకులు రాజా రమేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే అంటరానితనం జఠిలంగా ఉన్న రెండో జిల్లాగా కర్నూలు ఉందని తెలిపారు. కర్నూలు జిల్లాలో కౌతాళం, కోసిగి మండలాలు మొదటి, రెండు స్థానాలను ఆక్రమిస్తున్నాయన్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో దళితులను రచ్చబండలపై కూర్చోనివ్వరని, క్షవరం చేయకుండా, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగిస్తున్నారని తెలిపారు. దళితవాడలు వెలివాడలుగా, సమస్యలకు నిలయాలుగా ఉంటున్నాయన్నారు. అధికారులు గుర్తించి అంటరానితనాన్ని నిర్మూలించకపోతే, కలిసి వచ్చే ప్రజాతంత్ర శక్తులందరినీ కూడగట్టి ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు బంటకుంట తాయప్ప, మండల కార్యదర్శి మల్లనహట్టి తాయప్ప, మండల నాయకులు వీరేష్, భాస్కర్, చంద్రప్ప, రాగప్ప, కృష్ణ, హనుమేష్, పంపన్న, ఈరన్న, హనుమంతు, చిన్న ఈరన్న, ఆదాం, మరో 40 మంది పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్ బాబు










