గుంతకల్లు రూరల్ : హంద్రీనీవా కాలువ పనులను పూర్తి స్థాయిలో చేసి జిల్లా రైతులకు సాగునీరించేంత వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. వజ్రకరూరు మండలం రాగులపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పిల్ల కాలువల ద్వారా సాగు,తాగునీరు అందించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 2వ రోజు బుధవారం గుంతకల్లు మండలానికి చేరుకుంది. మండలంలోని నెలగొండ, మల్లేనిపల్లి, దోనిముక్కుల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రైతు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యకాసం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ ద్వారా సాగునీరిస్తే ప్రత్యక్షంగా 7000 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి మరో ఏడు వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గత మూడు సంవత్సరాల క్రితం గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి రూ.600 కోట్ల నిధులతో కాలువ పనులను 2022 జనవరి నాటికి పూర్తి చేస్తామంటూ శంకుస్థాపన చేశారన్నారు. ఈ పనులు జరక్కపోగా, ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన శంకుస్థాపన రాయి కూడా కనిపించలేదన్నారు. సాగునీరు లేక రైతులు పొలాలు బీడుగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. గుంతకల్లు, వజ్రకరూరు మండలాలలో వర్షాలు లేక రైతులు నిత్యం కరువు కాటకాలకు గురవుతున్నారని చెప్పారు. సాగునీరు అందింతే రైతులు పొలాలు సాగు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లో పిల్ల కాలువలు తవ్వించి రాగులపాడు ఎత్తిపోతుల పథకం ద్వారా సాగునీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సాగునీటి కోసం గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం నాడు ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.తిమ్మప్ప, సాకే నాగరాజు, కసాపురం రమేష్, విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు.










