Oct 30,2023 20:56

కాలువపై పర్యటిస్తున్న ఇఇ శైలేశ్వర్‌

ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని తుంగభద్ర దిగువ కాలువ ఇఇ శైలేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం ఆంధ్ర సరిహద్దు నుంచి దిగువ కాలువపై పర్యటించారు. 74, 75, 75 బి, కౌతాళం మేజర్‌, మాధవరం మేజర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కాలువలకు వారపు బంద్‌ పూర్తి కావడంతో సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు. మన వాటా కింద రావాల్సిన నీటి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులు కూడా సహకారం అందిస్తే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. వైసిపి మండల నాయకులు ఏకం రెడ్డి ఆయకట్టు రైతుల పరిస్థితి తుంగభద్ర దిగువ కాలువ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వరి, మిరప పంటలకు సాగునీరందించి ఆదుకోవాలని కోరారు. పంటలు చేతికొచ్చే స్థితిలో ఉన్నాయని, మరో రెండు తడులు సాగునీరందితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రైతుల నుంచి సహకారం అందిస్తామని, రైతులకు మాత్రం సాగునీరు అందించే బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఎల్‌ఎల్‌సి డిఇ మహ్మద్‌ సైఫుల్లా, సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.