ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర దిగువ కాలువ కింద సాగు చేసిన పంటలకు సాగునీరందించి ఆదుకోవాలని తుంగభద్ర దిగువ కాలువ డిఇ మహ్మద్ సైఫుల్లాను రైతులు నిలదీశారు. మంగళవారం మండలంలోని బంటకుంట, సులేకేరి, మధిర, పొదలకుంట, హాల్వి గ్రామ రైతులు సమస్యను ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నీటి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని తుంగభద్ర దిగువ కాలువ అధికారులను ఆదేశించడంతో ఎల్‌ఎల్‌సి డిఇ మంగళవారం చివరి ఆయకట్టు పొలాలను పరిశీలించారు. ఆయా గ్రామాల రైతులతో నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ... పత్తి, మిరప పంటలు సాగు చేసినట్లు తెలిపారు. ఎకరాకు పత్తికి రూ.40 వేలు, మిరపకు రూ.80 వేలు పైగానే పెట్టుబడులు పెట్టామని చెప్పారు. చివరి ఆయకట్టు కావడంతో సాగునీరు రావడం లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. పంట పొలాలకు సాగునీరందకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. సాగునీరందించి ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలు విన్న డిఇ మహ్మద్ సైఫుల్లా మాట్లాడుతూ... రైతులందరికీ సాగునీరందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు కూడా సహకరించాలని పేర్కొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న రైతులు










